ముంబై, ఏప్రిల్ 11: కంపెనీల లాభాలు తగ్గిపోయే అవకాశాలున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను ప్రధాన కార్పొరేట్ సంస్థలు ఆర్థిక ఫలితాల వెల్లడికి సిద్ధమవుతున్న తరుణంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకున్నది. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ తో పోల్చితే 0.6 శాతం వరకు, ఆపై ఆర్థిక సంవత్సరం (2020-21) జనవరి-మార్చితో పోల్చితే 3 శాతం మేరకు ఆయా సంస్థల నిర్వహణ లాభాలు పడిపోయే వీలుందని తాజా నివేదికలో క్రిసిల్ పేర్కొన్నది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో త్రైమాసిక లాభాల్లో క్షీణత కనిపించడం ఇది రెండోసారి కానున్నదని చెప్పింది.
ఉత్పాదక వ్యయం పెరిగిందని, అయినప్పటికీ కొనుగోలుదారులపై ఆ భారాన్ని మోపేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని క్రిసిల్ చెప్తున్నది. ఈ క్రమంలోనే లాభాలు పడిపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక 2021-22 మొత్తంగా వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణాల చెల్లింపులకు మునుపు లాభాలు (ఈబీఐటీడీఏ) 0.4 శాతం వరకు క్షీణించవచ్చని క్రిసిల్ డైరెక్టర్ హీటల్ గాంధీ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా అన్ని రంగాల్లోని వస్తూత్పత్తుల ధరలను అమాంతం పెంచేసిందన్నారు. ఈ ప్రభావంతో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) కూడా 1 శాతం లాభాలు తగ్గవచ్చన్నారు.