న్యూఢిల్లీ: చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రారంభమై నప్పటి నుంచి ఇప్పుడే అధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కరోజులో 5,280 కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు రావడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కట్టడికి పలు నగరాల్లో లాక్డౌన్ విధించారు. 13 నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్ విధించగా, మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు. దీంతో మొత్తం 3 కోట్ల మంది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. టెక్నాలజీ పరంగా ఎంతో ముఖ్యమైన షెంజెన్ నగరం పూర్తిగా మూతపడింది. అమెరికాలో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
భారత్లో కొత్త స్ట్రెయిన్ లేదు
పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్సాకాగ్ స్పం దించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అసాధారణ స్ట్రెయిన్ ఏదీ దేశం లో గుర్తించలేదని ఇన్సాకాగ్ సభ్యుడు, ప్రముఖ మైక్రోబయాలజిస్ట్ సౌమిత్రాదాస్ అన్నారు.
16 నెలల వరకు డిప్రెషన్
కరోనా సోకి దవాఖాన పాలైన వారిలో 16 నెలల వరకు డిప్రెషన్ తాలూకు సమస్యలతో బాధపడుతారని తాజా అధ్యయనంలో తేలింది. 7 రోజుల కన్నా ఎక్కువ రోజులు దవాఖానలో చేరిన వారికి ఈ సమస్య ఉంటుందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది.