హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో ప్రజలను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కాగ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మొదటి వేవ్, రెండో వేవ్ సమయంలో సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు వెచ్చించినట్టు తన నివేదికలో పేర్కొన్నది. 2019-20లో రూ.1,242.08 కోట్లు వెచ్చించారని, 2020-21లో రూ.3,050.33 కోట్లు వ్యయం చేశారని వివరించింది. ఇందులో 2020 ఏప్రిల్లోనే రూ.2,734.89 కోట్లు వ్యయం చేసిందని పేర్కొన్నది. ప్రభుత్వం చేసిన వ్యయంలో అత్యధిక శాతం పౌరసరఫరాల శాఖకు డిపాజిట్ చేసిందని తెలిపింది. కొవిడ్ విపత్తు సమయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వలస కార్మికులకు సైతం ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేసింది. కరోనా కారణంగా 2019-20, 2020-21లో కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయిందని కాగ్ గుర్తుచేసింది.
అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా చేసిన సాయాన్ని కాగ్ గుర్తించింది. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు రూ.500 నగదు, 12 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వడాన్ని కాగ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందుకోసం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సుమారు రూ.1,004.82 కోట్లు వెచ్చించిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో అత్యధిక లాభాల్లో ఉన్న సంస్థలను కాగ్ ఎత్తిచూపింది. ఇందులో మూడు విద్యుత్తు రంగానికి చెందినవే ఉన్నాయి. మొత్తం 12 సంస్థలు లాభాల్లో ఉండగా, ఇందులో 96 శాతం కేవలం నాలుగు సంస్థల నుంచే వస్తున్నట్టు తెలిపింది.
సంస్థ: లాభం (రూ.కోట్లలో)
సింగరేణి :272.64
టీఎస్ జెన్కో: 168.80
టీఎస్ ట్రాన్స్కో: 206.77
అటవీ అభివృద్ధి సంస్థ :51.83
మొత్తం :700.04