మెట్పల్లి, అక్టోబర్ 10: మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం వెంటనే ప్రకటిత మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పంట చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదని రైతులు విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలకు రూ.1800 లోపు మాత్రమే ధర పలుకుతుందని, మద్దతు ధర కుంటలకు రూ. 2400 ఉందన్నారు.
ఒక క్వింటాల్ వెంట రూపాయలు 500 నుంచి 600 నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని పలుమార్లు విన్నవించిన ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, మారు మురళీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.