నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) సోమవారం సహాయక చర్యలు కొనసాగాయి. సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివ శంకర్ ( Special Officer Shiva Shanker) లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ప్రదేశంలో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని , కన్వేయర్ బెల్ట్ (Conveyor belt) పునరుద్ధరణను వేగవంతం చేసినట్టు ఆయన వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నదని,ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా,సింగరేణి మైన్స్ రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్రతికూల పరిస్థితుల్లోను 24 గంటల పాటు శ్రమిస్తున్నారని వెల్లడించారు. సహాయక బృందాలు, నిపుణుల సమన్వయంతో పనిచేస్తూ, మైనింగ్ ప్రమాదాల్లో నిష్ణాతులైన వారి సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు.
ప్రస్తుతం టన్నెల్ లో కన్వేయర్ బెల్ట్ ను 13,630 మీటర్ల నుంచి 13,730 వరకు(వంద మీటర్లు) పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. తద్వారా టన్నెల్ లోపల ఎస్కవేటర్ల సహాయంతో సొరంగం లోపల ఉన్న మట్టిని బయటికి తరలించడానికి పనులను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్య లో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది టన్నెల్ లోపల సహాయక చర్యలకు అడ్డంకిగా ఉన్న స్టీల్‌ను కత్తిరించి లోకో ట్రైన్(Loko Train) ద్వారా బయటికి తరలిస్తున్నట్లు వివరించారు.
సొరంగంలోని ఊట నీటిని ప్రతిరోజు అత్యధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటికి పంపించేస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాలు ప్రతినిత్యం తమకు కేటాయించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తూ సహాయక పనులను వేగవంతం చేస్తున్నారని కొనియాడారు. సహాయక సిబ్బంది పండుగలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొనడం అభినందనీయమని, వారి యొక్క స్ఫూర్తిని ప్రశంసించారు.
మట్టి తవ్వకాలు కనుగుణంగా వెంటిలేషన్ పునరుద్ధరణ జరుగుతుందని, సహాయక సిబ్బందికి ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి సుదర్శన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేతి చంద్ర, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి, జె పి కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.