హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేస్తే ప్రతి పట్టణానికీ జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్నీ ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆదేశించారు. పురపాలన అంటేనే పౌర పాలన అన్న విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. ఈ దిశగా పట్టణాల్లోని పౌరులను భాగస్వాములు చేసే లా వారితో మమేకమై పనిచేయాలని సూచించారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతినెలా ఎలాంటి ఆటం కం లేకుండా స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే అన్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి లక్ష్యాలను అందుకొనే దిశగా సాగాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పట్టణ ప్రగతిలో చురుకుగా పాల్గొని, వాటిని అమలుపరిచిన వాటికి జాతీయ అవార్డులు దక్కిన విషయా న్ని గుర్తుచేశారు. పట్టణాల పురోగతి కోసం టీయూఎఫ్‌ఐడీసీని ఏర్పాటుచేసి పట్టణ ప్రగతి నిధులకు అదనంగా పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ నిధులతో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్తు దీపాల నిర్వహణ, గ్రీనరీ నిర్వహణ వంటి కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించాల్సిన బాధ్యతను పురపాలక సంఘాల ప్రతినిధులతోపాటు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఆరు నెలల్లో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లను పూర్తిచేయాలని, మిగతా పెండింగ్ పనులపై దృష్టిసారించాలని ఆదేశించారు.
అధికారులు తనిఖీలు చేయాలి
స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక కలెక్టర్ స్థాయి అధికారిని నియమించిన వ్యవస్థ దేశంలో ఎక్కడాలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇంతటి నిబద్ధతతో స్థానిక సంస్థల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకొని చిత్తశుద్ధితో అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సాధ్యమైనన్ని ఎక్కువసార్లు పట్టణాలను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని సూచించారు. పురపాలనలో వినూత్నంగా ముందుకుపోతున్న కరీంనగర్కార్పొరేషన్తోపాటు ఇల్లందు పురపాలికల అధికారులను, ప్రజాప్రతినిధులను మంత్రి కేటీఆర్ అభినందించారు. సమావేశంలో పుర పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
పట్టణ వ్యవస్థపై ఒకే దగ్గర సమగ్ర సమాచారం
పట్టణాలు, నగర వ్యవస్థ సమగ్ర సమాచా రం ఒకే దగ్గర దొరికేలా మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ (ఎంఎన్సీ)ను అధికారులు ఏర్పాటుచేశారు. ము న్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, వాటి ప్రణాళికలు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ, బడ్జెట్ రూపకల్పన, పార్కులు, మార్కెట్లు, రోడ్లు, వాటి ప్రణాళికలు, ఇలా హైదరాబాద్ నగర ప్రతి సమాచారా న్ని, వాటి చరిత్రను, నేపథ్యాన్ని తెలిపేలా, ఎన్నికలు వాటి నిబంధనలు, మార్గదర్శకాలను ఎంఎన్సీలో ఏర్పాటుచేశారు. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో ఎంఎన్సీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎంఎన్సీ ఫర్ సిటీ మేనేజర్స్ పేరుతో దీనిని రూపొందించారు. అందరికీ ఉపయుక్తంగా ఉండేలా ఎంఎన్సీని రూపొందించిన మున్సిపల్ అధికారులు అరవింద్‌కుమార్, ఎన్ సత్యనారాయణ, ఇతర సిబ్బందిని మంత్రి కేటీఆర్ ఈ సందర్బంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, తాతా మధుసూదన్, ఫారూఖ్ హూస్సేన్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.