నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ వేసిన నామినేషన్‌పై వివాదం తలెత్తింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమ్మతి లేకుండా కొంత మంది సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్ వేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందిపేట ఎంపీటీసీ నవనీత సంతకాన్ని ఫోర్జరీ చేసి తన నామినేషన్ ప్రపోజల్ జాబితాలో చేర్చినట్లుగా తెలిసింది. ఈ విషయంపై బుధవారం సంబంధిత వ్యక్తులు అధికారులకు సదరు అభ్యర్థిపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదని.. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఎన్నికల అధికారులు సూచించారు. వచ్చే ఫిర్యాదు ఆధారంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోటగిరి శ్రీనివాస్‌పై నిబంధనల ప్రకారం విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్‌కు తాను మద్దతు ఇవ్వలేదని, సంతకం చేయలేదని 31వ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ సుల్తానా పేర్కొన్నారు. దీనిపై బుధవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.