న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్‌గా బీజేపీ, ఆరెస్సెస్‌కు, ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహితుడైన మనోజ్ సోనీ ఇటీవల నియమితులయ్యారు. దీనిపై దుమారం రేగుతున్నది. వివాదాస్పద వ్యక్తిని యూపీఎస్సీ చైర్మన్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఒకటి తర్వాత ఒకటిగా సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తూ వస్తున్నదని అన్నారు. యూపీఎస్సీని యూనియన్ ప్రచారక్ సంఘ్ కమిషన్‌గా మారుస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటుగా రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు.
గుజరాత్‌లోని స్వామి నారాయణ్ మతవర్గానికి చెందిన సోనీ ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు ప్రసంగాలు రాసిపెట్టేవారు. అధినేతతో గల సాన్నిహిత్యం దృష్ట్యా ఆయనను చిన్న మోదీ అని పిలిచేవారు. గతంలో ఆయన వడోదరాలోని ఎంఎస్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. అతిచిన్న వయసులో వీసీ పదవి చేపట్టిన వ్యక్తిగా సోనీ వార్తలకెక్కారు. ఆ పదవిలో ఆయన బీజేపీ, ఆరెస్సెస్‌కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని విమర్శల పాలయ్యారు. గుజరాత్ మతకల్లోలాలను బీజేపీ కోణంలో విశ్లేషిస్తూ ఆయన రాసిన పుస్తకంపై కూడా విమర్శలు వచ్చాయి. చిన్నప్పటి నుంచి స్వామినారాయణ్ అనుపమ మిషన్‌లో పనిచేసిన సోనీని 2020 జనవరిలో మఠం ‘నిష్కామ కర్మయోగి’గా నియమించారు.