హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూహెచ్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. వర్సిటీలోని కీలక పోస్టుల్లో ఉన్నవారిపై అనేక ఆరోపణలొస్తున్నాయి. టెండర్లు.. బినామీలు.. కొందరి అతిజోక్యం వెరసి వర్సిటీలో పాలన అదుపు తప్పుతున్నది. విద్యావాతావరణం దెబ్బతింటున్నదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా రిజిస్ట్రార్ మార్పు వివాదం వర్సిటీని పట్టి పీడిస్తున్నది. ఈ విషయంలో వర్సిటీ ఆచార్యులు, సిబ్బంది వర్గాలుగా విడిపోయారు. రిజిస్ట్రార్‌ను మార్చాలని కొందరు.. మార్చకూడదని మరికొందరు ప్రయత్నాలు చేస్తుండటం పంచాయితీకి దారితీసింది. ఈ పంచాయితీ రాజ్యసభ సభ్యడు వేం నరేందర్‌రెడ్డి వద్దకు చేరినట్టు సమాచారం.
బిల్లుల విడుదలకు వర్సిటీ పెద్దలు 10% కమీషన్ డిమాండ్ చేస్తున్నారట. గతంలో ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి వీసీగా ఉన్నప్పుడు జేఎన్టీయూహెచ్లో చేపట్టిన అనేక నిర్మాణాలు, సివిల్స్ వర్క్స్‌కు సంబంధించిన బిల్లులను ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెట్టారు. వాటిని విడుదల చేయాలంటూ ఓ పెద్దస్థాయి వ్యక్తి నుంచి వర్సిటీ పెద్దలకు ఫోన్లు వెళ్లినప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదట. అనంతరం ఓ ఫ్యాకల్టీ మెంబర్ మధ్యవర్తిత్వంతో ఎట్టకేలకు 10% కమిషన్‌కు ఒప్పందం కుదిరిందట. దీంతో ఇటీవల ఏకంగా 33 పెండింగ్ బిల్లులు క్లియర్ చేశారట. ఇందుకు పర్సంటేజీల దందాయే కారణమని వర్సిటీ ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.
జేఎన్టీయూహెచ్లో మళ్లీ ‘జేజమ్మ’ రాజ్యం నడుస్తునట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకాలం తెరవెనుక నుంచి మంత్రాంగం నడిపిన ‘జేజమ్మ’ ఇప్పుడు మళ్లీ జోరు పెంచి అనేక విషయాల్లో, కీలక అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారట. మరికొందరు కోటరీగా ఏర్పడి తమకు నచ్చినట్టు జరగాలని పట్టుబడుతూ కమీషన్లకు తెరలేపారట. వీరంతా ఏకంగా వర్సిటీనే శాసిస్తున్నారట. వర్సిటీని తమ గుప్పెట్లో పెట్టుకుని పర్సంటేజీలు పుచ్చుకోవడమే ఎజెండాగా పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వర్సిటీలోని ఓ కీలక వ్యక్తి పుత్రరత్నంపైనా ఆరోపణలున్నాయి. ఆ పుత్రరత్నానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా సీఎస్ఈ బీ-క్యాటగిరీ సీట్ల దందా నడిపినట్టు వర్సిటీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. కీలక వ్యక్తి పేరు చెప్పి ఆ పుత్రరత్నం కాలేజీలను ప్రభావితం చేస్తున్నాడట. ఆ కాలేజీల్లో సీఎస్ఈ బీ-క్యాటగిరీ సీట్లకు బేరాలు కుదుర్చుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలేజీలో కన్వీనర్ కోటా ఫీజు కట్టి, విద్యార్థుల నుంచి లక్షలకు లక్షలు పుచ్చుకునే స్కెచ్‌ను అమలు చేస్తున్నట్టు వర్సిటీ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అలా ఇప్పటికే కొన్ని కాలేజీల్లో సీట్లు బ్లాక్ చేసి, విద్యార్థులకు ఇప్పించినట్టు వినికిడి.
పాలక మండలి అనుమతి లేకుండానే రూ.4 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి రూ.10 లక్షలు ఖర్చుపెట్టేందుకే పాలకమండలి అనుమతి తప్పనిసరి. కానీ, ఈసీ అనుమతి లేకుండా ఏకంగా రూ.4 నాలుగు కోట్లు ఖర్చుచేయడం పలు అనుమానాలకు తావిస్తున్నదని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు.
జేఎన్టీయూహెచ్లో జరుగుతున్న పరిణామాలు, విద్యార్థుల ఆరోపణలపై ఆరా తీసేందుకు ‘నమస్తే తెలంగాణ’ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్‌కుమార్‌రెడ్డిని ఫోన్‌ద్వారా సంప్రదించడంతో పెండింగ్ బిల్లులు చెల్లించిన మాట నిజమేనని అంగీకరించారు. వర్సిటీలో చేపట్టిన పనులకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నారో లేదో పరిశీలించాకే బిల్లులు జారీచేస్తున్నామని, నిబంధలన ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. బిల్లుల చెల్లింపులో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో రిజిస్ట్రార్, రెక్టార్ల నియామకంలో వీసీ ఉత్తర్వులే ప్రామాణికమని వర్సిటీ తెలిపింది. రెక్టార్, రిజిస్ట్రార్ నియామకానికి పాలకమండలి ఆమోదం తప్పనిసరి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. వీసీ ఉత్తర్వులతోనే వీరి నియామకా లు అమల్లోకి వస్తాయని.. ఈసీ ఆమోదం లాంఛనమేని స్పష్టంచేశాయి.