న్యూఢిల్లీ: దేశంలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ, విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఇప్పుడు ప్రభుత్వాన్ని జవాబుదారీతనంగా ఉంచేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నది. యువతకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతి జిల్లాలో, గ్రామ స్థాయిలో సైతం పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీజేపీ ప్రతినిధి సౌరవ్దాస్ వెల్లడించారు. ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం, ఆహార భద్రత తదితర సమస్యలపై ప్రజలను సమీకరించేందుకు సీజేపీ నేతలు గ్రామాల్లో సభలు నిర్వహించనున్నారని తెలిపారు. ప్రస్తుతానికి సీజేపీని రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసుకునే ఆలోచన లేదని, ఒక చైతన్య వేదికగా దేశవ్యాప్తంగా పర్యటిస్తామని సౌరవ్ దాస్ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై సీజేపీ పోరాటం కొనసాగుతుందని, ఢిల్లీ పోలీసుల అణచివేతపై డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.