జైపూర్, సెప్టెంబర్ 2: న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు రాజస్థాన్ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని సీఎం గెహ్లాట్ వ్యాఖ్యానించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక న్యాయవాది శివ్‌చరణ్ గుప్తా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అశుతోష్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని గెహ్లాట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గెహ్లాట్ న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేశారు. ‘కొంతమంది న్యాయవాదులు తీర్పులను ప్రభావితం చేస్తున్నారు. న్యాయవాదులే తీర్పులను రాసి ఇస్తున్నారు. అవే తీర్పు రూపంలో వస్తున్నాయి’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న న్యాయవాదులు హైకోర్టు, కింది కోర్టుల్లో శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.