హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులను నాన్ సాంక్షన్ పోస్టులుగా చూపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎప్పుడు జరుగలేదని లెక్చరర్ల సంఘాల నేతలు వాపోతున్నారు. ఇది అన్యాయమని అంటున్నారు. రాష్ట్రంలో 451 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరిని 2026-27 విద్యాసంవత్సరానికి రెన్యువల్ చేస్తూ జీవో జారీచేసిన సర్కారు ఆయా పోస్టులను నాన్ సాంక్షన్ పోస్టులుగా చూపించింది. గతంలో శాంక్షన్ పోస్టులుగా చూపించగా, ఈ సారి భిన్నంగా జరుగడంతో లెక్చరర్లలో కలవరం మొదలయ్యింది. ఇది చిన్న విషయం కాదని, దీంతో అత్యంత ప్రమాదం పొంచి ఉన్నదని లెక్చరర్లు వాపోతున్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ నుంచి తప్పించుకునేందుకు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. భవిష్యత్తులో రెగ్యులరైజ్ చేయాల్సి వస్తే.. ఇవి శాంక్షన్ పోస్టుల్లో వీరు పనిచేయడం లేదని సాకుగా చూపించే ప్రమాదమున్నదని అభిప్రాయపడుతున్నారు. తక్షణమే అధికారులు, ప్రభుత్వం కల్పించుకొని జీవో-1171ను సవరించి, శాంక్షన్ పోస్టులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ వైకుంఠం కోరారు. జీవోను మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.