‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీతో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కన్నడ అగ్ర హీరో యశ్. ఆయన తాజా చిత్రం ‘టాక్సిక్’ ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు బాలీవుడ్ ‘రామాయణ’లో కూడా యశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత యశ్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ‘సప్త సాగరదాచే ఎల్లో’ (తెలుగులో ‘సప్తసాగరాలు దాటి’) చిత్రంతో కన్నడంలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు హేమంత్ ఎమ్ రావ్.
ఆయన దర్శకత్వంలో యశ్ తన తదుపరి సినిమా చేయబోతున్నారని కన్నడ ఫిల్మ్‌వర్గాల్లో వినిపిస్తున్నది. ఇందులో యశ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారని, సామాజిక అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథలో ఆయన ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిసింది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.