న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నందున, అధిక మైలేజీనిచ్చే కార్లపైనే ఇండియాలో కొనుగోలుదార్లు ఆసక్తి చూపిస్తారని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. గత 15 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు 35 శాతం మేర అధికంకావడంతో వాహనం నడపడానికయ్యే వ్యయాలు గణనీయంగా పెరిగినందున, అధిక ఇంధన సామర్థ్యాన్ని కనబరుస్తూ, మెయింటెనెన్స్ వ్యయాలు తక్కువగా ఉన్న కార్లను కొంటారని అంచనావేస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. ప్రత్యేకించి రూ.10 లక్షలలోపు ధరకలిగిన కార్లకు ఈ రీతిలో డిమాండ్ పెరుగుతుందన్నది. ఈ పరిణామం మారుతి సుజుకికి లబ్ది చేకూరుస్తుందని అంచనావేసింది. అధిక మైలేజీలోనూ, తక్కువ యాజమాన్య వ్యయాల్లోనూ మారుతియే మార్కెట్ లీడర్‌గా తమ విశ్లేషణలో తేలినట్లు హెచ్ఎస్బీసీ వివరించింది.