kaleshwaram | తెలంగాణ రాష్ట్ర ప్రయోనాల కోసం ఎంతో దూరదృష్టితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ భూముల్లో సిరులు పండించిన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్షతో నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు రిపేర్‌కు వస్తే ఎల్ అండ్ టీ కంపెనీ వాటికి మరమ్మతులు చేస్తామని చెప్పినా ఈ ప్రభుత్వం అడ్డుకుందని అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లు ఆన్ చేయమని రిటైర్డ్ ఇంజినీర్లు చెబుతున్నా సీఎం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాబట్టే రాష్ట్ర రైతుల ప్రయోజనాలు అర్థం కావడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రైతుల కోసమే వాడుకోవాలి కానీ రాజకీయ దురుద్దేశాలకు వాడుకోవద్దని హితవు పలికారు. రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్లనే దేవాదుల కింద పంట పొలాలు ఎండిపోయాయని, జూన్‌లో దేవాదుల పంపులను ఆన్ చేస్తే రైతులకు మేలు జరిగేదని వెల్లడించారు. ప్రతి చినుకును కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తే రేవంత్ వాటిని విస్మరిస్తున్నారు. ఇలా అయితే రాజధాని నగరానికి తాగునీటి కష్టాలు మొదలవుతాయి.
ఫ్రస్ట్రేషన్లో కవిత..
ఇటీవల కవిత చేసిన విమర్శలపై ఓ విలేకరి ప్రస్తావించగా.. కవిత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, ఆమె మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను విమర్శించే కవిత కాంగ్రెస్ అసమర్థ పాలనపై ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. ఆ పార్టీతో కవితకు ఏదో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే ఆ పార్టీని విమర్శించడం లేదని తెలిపారు.