కొల్లాపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ( Congress promises ) అమలు చేయని కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ( Local Body Elections ) తరమికొట్టాలని బీజేపీ మండల అధ్యక్షులు కేతూరి నారాయణ డిమాండ్ చేశారు. గురువారం కొల్లాపూర్ తహసీల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయి పార్టీ చేతులెత్తేసిందని ఆరోపించారు.
కల్యాణ లక్ష్మి పథకంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం హామీ ఏమైందని, పింఛన్లు రూ.2 వేల నుంచి రూ. 4 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనీయవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు.
ఈ సందర్భంగా పలు సమస్యలపై కొల్లాపూర్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ సందు రమేష్, మాజీ మండల అధ్యక్షులు సాయి కృష్ణ గౌడ్, జిల్లా కార్యదర్శి తిరుమల యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి ఒరే శేఖర్, మండల ఉపాధ్యక్షులు పాండు, సాయి ప్రకాష్, మండల కార్యదర్శి నరసింహ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కల్పనా రెడ్డి, గడ్డం శ్రీరామ్, చందు, రమేష్, భీముడు, శ్రీరామ్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.