HomeHyderabadCongress Promised Yesterday And Ignored It Today
రైతుల జీవితాలు బుగ్గిపాలే!
‘ఫ్యూచర్ సిటీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలను బుగ్గిపాలు చేసే కుట్రకు పాల్పడుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాటాలకు బాధిత రైతాంగం సిద్ధం కావాలి’ అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
ఫ్యూచర్, ఫార్మా సిటీల పేర సర్కార్ దగా
1.80 లక్షల ఎకరాల భూములకు ఎసరు
ఫార్మా సిటీని ఎందుకు రద్దు చేయడం లేదు
నాడు హామీ ఇచ్చి నేడు విస్మరించిన కాంగ్రెస్
మరో పోరాటానికి రైతాంగం సిద్ధం కావాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
ఖైరతాబాద్, నవంబర్ 5: ‘ఫ్యూచర్ సిటీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలను బుగ్గిపాలు చేసే కుట్రకు పాల్పడుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాటాలకు బాధిత రైతాంగం సిద్ధం కావాలి’ అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతినిధులు కన్నెగంటి రవి, డాక్టర్ బాబూరావు, సరస్వతి కవుల మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మా సిటీని రద్దు చేయిస్తానని, రైతుల భూములు వారికి అప్పజెప్తామని ఎన్నికల ముందు అప్పటి టీపీపీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.
అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. పైగా ఫార్మా సిటీని కొనసాగిస్తున్నామని కోర్టులో ప్రకటించడం వెనుక ప్రభుత్వ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతుల నుంచి సేకరిస్తున్న భూముల్లో విలువైన వృక్ష సంపద, అరుదైన జంతువులు ఉన్నాయని, సారవంతమైన నేల ఉన్నదని, ఫార్మా, ఫ్యూచర్ సిటీల వల్ల ప్రకృతి సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమితోపాటు అదనంగా వేలాది ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవాలన్న కుట్ర దాగి ఉన్నదని ధ్వజమెత్తారు. మొత్తం 1.80 లక్షల ఎకరాల భూమికి కాంగ్రెస్ సర్కార్ ఎసరు పెట్టిందని ఆరోపించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ఏడు మండలాల్లోని 56 గ్రామపంచాయతీలను రద్దుచేసి వాటిని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కట్టబెట్టారని తెలిపారు.
ఆ భూములను మళ్లించరాదు
2013 భూ సేకరణ చట్టం ప్రకారం.. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం పర్యావరణ అనుమతులు తీసుకున్న భూమిని.. మరొక ప్రయోజనం కోసం మళ్లించరాదని కన్నెగంటి రవి, డాక్టర్ బాబూరావు, సరస్వతి కవుల వివరించారు. అలాంటి చర్యలు తీసుకోవాలంటే చట్టంప్రకారం తగిన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. వివిధ అనుమతులతోపాటు గ్రామసభల ద్వారా ప్రజల ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్పారు.
ఆ తర్వాత అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి మళ్లీ అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా నిబంధనలకు విరుద్ధంగా, ప్రజల సమ్మతి తీసుకోకుండా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నదని తెలిపారు. 2025 ఏప్రిల్ 3 నుంచి మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మకిద్ద గ్రామాల్లో వందలాది మంది పోలీసులు మోహరించి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. చట్ట విరుద్ధంగా, కోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్, ఆర్డీవో, పోలీస్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు వేసినా వాటిని లెక్కచేయకుండా సదరు అధికారులు రైతుల భూముల్లో కంచెలు వేయిస్తున్నారని వాపోయారు. బాధిత రైతులతో కలిసి ప్రజాస్వామిక వాదులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.