PV Narasimha Rao | తెలంగాణ గడ్డమీద పుట్టి.. దేశ ప్రధాని పదవి చేపట్టి.. జగద్విఖ్యాతి గాంచిన మహనీయుడు పీవీ నరసింహారావు. బతుకంతా కాంగ్రెస్‌కు త్యాగం చేసిన నిరాడంబరుడు. అలాంటి మహానేతకు కాంగ్రెస్ గౌరవం ఇవ్వకపోగా, నిరంతరం అవమానిస్తున్నది. బతికున్నప్పుడు గౌరవించలేదు. చనిపోయాక దహనానికీ ఆరడుగుల స్థలం ఇవ్వలేదు. కట్టె కాలేదాకా కూడా కాపలా కాయలేదు. ప్రపంచం గర్వించే మేధావికి భారతరత్న ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు. ఆయన దేశనాయకుడు కాదా.. దక్షిణాది నుంచి ఎంపికైన తొలి ప్రధాని. తెలుగు గడ్డ నుంచి వెళ్లి ఢిల్లీకి రాజైన తొలి రాజకీయ చక్రవర్తీ ఆయనే. 65 ఏండ్లు కాంగ్రెస్‌కే తన జీవితాన్ని ధారపోసిన పీవీని స్మరించడానికీ కాంగ్రెస్ నేతలకు నోళ్లు పెగలడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన మంథనికి వచ్చిన రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు అనైతికం. పీవీ విగ్రహానికి అల్లంత రాన నిల్చొని అసత్యాలు పలికారే కానీ, తెలంగాణ నిజాయతీకి దండం పెట్టలేదు. ఇదీ కాంగ్రెస్ పగ. ఇదీ తెలంగాణ పట్ల కాంగ్రెస్‌కున్న ప్రేమ.
దేశానికి సేవలందించే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని పదవులను చేపట్టిన ప్రముఖ నాయకుల సమాధులు, స్మారక స్థలాలు ఢిల్లీ యమునానదీ తీరంలోని రాజ్‌ఘాట్ సమీపంలోని ఉన్నాయి. ప్రధానిగా 15 రోజులు మాత్రమే పనిచేసిన గుల్జారీలాల్ నందా మొదలు 17 సంవత్సరాలు ఏలిన నెహ్రూ వరకు అందరు ప్రధానమంత్రుల సమాధులూ రాజ్‌ఘాట్ సమీపంలోనే నిర్మించారు. అయితే ఆరు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు సేవలు చేసి, ప్రధానిగా దేశాన్ని నిలబెట్టిన సంస్కరణశీలి, అపర చాణక్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అంతిమ సంస్కారానికి మాత్రం ఢిల్లీలో చోటే లేదన్నది.. కాంగ్రెస్ పార్టీ. దేశ రాజధానిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోగా, ఆయన సమాధికి ఆరడుగుల నేల కూడా ఇవ్వని కర్కోటక వైఖరిని కాంగ్రెస్ ప్రదర్శించింది.
ఒక్కసారి రాజ్‌ఘాట్‌కు వెళ్లి స్మారక స్థలాలు చూస్తుంటే.. అక్కడ మన తెలంగాణ బిడ్డ పీవీకి అంత్యక్రియలు జరగలేదన్న సంగతి తెలిసి మనసు కకావికలమవుతుంది. అక్కడ పీవీకి కేవలం ‘స్మృతి స్థల్’ అని పేరు మాత్రమే మిగిలింది. విందు లేదుకాని విడెం (తాంబూలం) తీసుకొమ్మన్న సామెతను గుర్తు చేస్తుందది. సమాధి లేని స్మృతి అటువంటిదే!
నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో ఉండి తదుపరి జనతా పార్టీ కూటమిలో చేరి, తరువాత భారత జాతీయ కాంగ్రెస్ (జె)ను స్థాపించి, దేశ ఉప ప్రధానిగా తక్కువ కాలం పనిచేసిన బాబూ జగ్జీవన్ రామ్ (సమతా స్థలి), జనతా పార్టీ తరఫున తక్కువ కాలం ప్రధానిగా ఉన్న చౌదరీ చరణ్ సింగ్ ( కిసాన్ ఘాట్), నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం ఏలిన ఇందిరాగాంధీ (శక్తి స్థల్), సానుభూతితో గెలిచిన రాజీవ్‌గాంధీ ( వీర్ భూమి), ఐకే గుజ్రాల్ పార్థివ దేహాలకు దహన క్రియలను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. మన పీవీ విషయంలో మాత్రం కాంగ్రెస్ దమన నీతిని అనుసరించింది.
పార్టీకి జీవితాన్ని ధారపోసిన వ్యక్తి విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు దశాబ్దాలు గడిచినా మర్చిపోలేం. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ ప్రధాని పదవికే వన్నె తెచ్చారాయన. అంతటి మహనీయుడు మరణించాక ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీలోని పార్టీ ఆఫీసు (24 అక్బర్ రోడ్)కు తరలించకుండా, తర్జనభర్జన పడ్డారు కాంగ్రెస్ నేతలు. పీవీ భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం గేటు ముందుంచాలని అధిష్ఠానం ఆదేశించింది. అంతేకాదు హైదరాబాద్‌కు తరలించాలని, అక్కడే దహన సంస్కారాలు చేయమని హుకుం జారీచేసింది. వాటినైనా సక్రమంగా నిర్వహించిందా అంటే అదీ లేదు! అర్ధ సంస్కారంతో పీవీని తీవ్రంగా అవమానించింది. అసంపూర్ణంగా కాలిన పీవీ పార్థివదేహాన్ని చూసి ఆయన అభిమానుల గుండె తరుక్కుపోయింది.
పీవీ విషయంలో కాంగ్రెస్ ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు నాటి మేటి నేతలు మొదలుకొని నేటి నేతల వరకు నోళ్లు మెదపడం లేదంటే వారు పీవీకి చేసిన అమర్యాదనే కారణం. వీరంతా ఏకాంతంలో పీవీని పొగిడి, బాహాటంగా తెగడేవారే! పీవీ గతించి 19 సంవత్సరాలు అవుతున్నది. ఇన్నేండ్లలో కాంగ్రెస్ నేతలు పీవీ పేరును స్మరించిన దాఖలాల్లేవు. తెలంగాణ నేతలు సైతం.. మన పీవీ అన్నట్టు కనిపించదు. కేవలం సోనియమ్మ మెప్పు కోసం దేశాన్ని నిర్మించిన మన బిడ్డను విస్మరించారు టి.కాంగ్రెస్ నేతలు.
మానవతావాదిగా, దేశం కోసం బతికిన నేత పీవీ. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలా అత్యంత నిరాడంబరంగా జీవించారు. శాస్త్రికి కాస్తలో కాస్తయినా గౌరవం దక్కింది. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయానికి లాల్‌బహదూర్ శాస్త్రి పేరును పెట్టారు. కానీ, మనవాళ్లు రాష్ట్రంలో ఏ నిర్మాణానికీ పీవీ పేరు పెట్టలేదు సరికదా, పెట్టాలనే యోచన కూడా చేయలేదు. విమానాశ్రయానికి వెళ్లే ఫ్లై ఓవర్‌కు పీవీ ఎక్స్‌ప్రెస్ వే అని కంటితుడుపుగా పెట్టారు. బతికి ఉన్నప్పుడు ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ నేతలు.. మరణించిన తర్వాత కూడా అలాగే విస్మరించారు. ఒక ఫ్లై ఓవర్‌కు ఆయన పేరు పెట్టి.. పీవీ స్థాయిని తగ్గించారని ఆయన అభిమానులు విమర్శిస్తుంటారు.
పీవీ అంతిమ సంస్కారాన్ని విషాదకరంగా ముగించిన కాంగ్రెస్.. కనీసం ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తుందా అంటే అదీ లేదు. ప్రధానిగా పీవీ సేవలను ప్రతిపక్షాలు ప్రశంసిస్తున్నా.. కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉండటం.. ఆ పార్టీ నైతికతకు నిదర్శనం. ప్రధానిగా కాకున్న, బహుభాషా కోవిదుడిగా, సాహితీవేత్తగా ఆయనను భారతరత్నతో గౌరవించాలి. దానికీ కాంగ్రెస్ చొరవ చూపలేదు. యునైటెడ్ ఫ్రంట్, యూపీఏలు ఉదాసీనంగా వ్యవహరించడం పీవీని మాత్రమే కాదు, తెలంగాణ వారినీ అవమానించడమే!
ఒకసారి భారతరత్న పురస్కార గ్రహీతల జాబితాను చూస్తే, నెహ్రూ,ఇందిర,రాజీవ్‌ల పేర్లు కనిపిస్తాయి. లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన 45 ఏండ్లకు ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ప్రణబ్‌ముఖర్జీతోపాటు కాంగ్రెసేతరులలో మురార్జీ దేశాయ్, వాజపేయి భారతరత్నలుగా కనిపిస్తారు. ఆపద్ధర్మ ప్రధాని గుల్జారీలాల్ నందకు 1997లో భారత రత్న పురస్కారం లభించడం నందా అదృష్టమనే చెప్పుకోవాలి. అందుకే ఆకాశమంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. కాంగ్రెస్‌కు వెట్టిచాకిరీ చేసిన పీవీకి ఆ అదృష్టం లేదనే చెప్పుకోవాలి.
పీవీ ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఆయనలో అనేక కోణాలు ఉన్నాయి. నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు. విద్యాశాఖా మంత్రిగా, ముఖ్యమంత్రిగా, విదేశాంగమంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులుగా, ప్రధానిగా ఆయన పోషించిన పాత్రలు అనేకం. దయనీయ పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ధనవంతమైన దేశంగా మార్చిన ‘విప్లవ తపస్వి’ ఆయన. ఇన్ని అర్హతలున్నా కాంగీ ధృతరాష్ట్రులకు ఈ తెలంగాణ తేజం కనిపించ లేదు, ఇప్పటికీ గుర్తించడం లేదు. పూజనీయుడైన వ్యక్తిని గౌరవించని పార్టీ,వ్యవస్థను గౌరవిస్తుందా? సమాజాన్ని మారుస్తుందా??
ఈ రోజు మనం ఇలా బతుకగలుగుతున్నామంటే అందుకు పీవీ పారిశ్రామిక, సాంకేతిక, సామాజికరంగాలలో తెచ్చిన మార్పులే కారణం. ఆయనే లేకపోతే మన భారతదేశం పాలస్తీనాలా తయారయ్యేదన్నా అతిశయోక్తి కాదు. పీవీ తెచ్చిన 73,74 రాజ్యాంగ సవరణల వల్లే పంచాయతీ రాజ్ వ్యవస్థ బలపడింది. సంస్కరణల విషయంలో ఆయన ముఖ్యమంత్రులను కలుపుకొని వెళ్లారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా పీవీ సంస్కరణలను సమర్థించింది. బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్, కర్ణాటక సీఎం దేవేగౌడ సైతం పీవీకి మద్దతు పలికారు.
లోకమంతా మెచ్చుకున్న పీవీ అంటే కాంగ్రెస్‌కు కంటగింపు. పీవీ చాలా సందర్భాల్లో అధిష్ఠానంతో అసహనంగా ఉండిపోయారు. రాజీవ్ శ్రీలంకకు సైన్యాన్ని పంపడం, ఇందిర తీసుకున్న ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్ణయంతో పీవీ ఎంతో కలత చెందారని నట్వర్ సింగ్ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’లో పేర్కొన్నారు.
పీవీ చెప్పిన సలహాలను ఇందిరమ్మ పెడచెవిన పెట్టేది. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టినపుడు ఆయనను ఆహ్వానించి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సిందిగా పీవీ సూచించారట. దీనికి నాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంను ఎన్టీఆర్ దగ్గరికి రాయబారం పంపాలని సూచించారు. చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉండటమే కాదు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండటం వల్ల నచ్చజెప్పొచ్చని పీవీ సలహా ఇచ్చారట. కానీ ఇందిర.. ఆ మాటలు వినక భారీ మూల్యం చెల్లించుకున్నది. ఇలా ఒకటా, రెండా.. పీవీ విషయంలో కాంగ్రెస్ వైఖరి గురించి చెబుతూ పోతే మహాభారతమే అవుతుంది. అయినా, పీవీ ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు, అననీయలేదు. చెప్పంగ వినకుంటే చెడంగ చూస్తరని మౌనంగా ఉండిపోయారు.
పార్టీకి, దేశానికి ఇంత చేసిన పీవీనే పట్టించుకోని కాంగ్రెస్, ఢిల్లీలో పీవీకి ఆరడుగుల నేల ఇవ్వని కాంగ్రెస్, పెద్దాయనను మచ్చుకైనా తలచుకోని కాంగ్రెస్.. ఆరు గ్యారంటీల వాగ్దానాలు ఎవరు నమ్ముతారు? మొసలి కన్నీరు నమ్మి కోతి తన గుండెకాయనిచ్చిందట. కాంగీ వాగ్దానాలు కూడా నీటి మీద రాతలే!! అందుకు వారి అరవై ఏండ్ల పాలనే సాక్ష్యం.
…? డాక్టర్.వి.వి.రామారావు