మనోహరాబాద్, జూలై 18: గత ప్రభుత్వాల హయాంలో అణిచివేతకు గురైన మెదక్ జిల్లాను అనేక పథకాలతో అభివృద్ధి పరిచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు మెదక్ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన పదేండ్లలో మెదక్ జిల్లా దేశంలోనే ఆదర్శ జిల్లాగా నిలిచిందని తెలిపారు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని దుయ్యబట్టారు.
మెదక్ జిల్లాను వెనుకబాటుకు గురిచేసిందే కాంగ్రెస్ పార్టీ అని హేమలతా శేఖర్ గౌడ్ విమర్శించారు. కేవలం మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి ఏడాదిన్నర అయినా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే రూ. 4 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. ఆ అప్పు కూడా హెలికాప్టర్లో తిరగడానికి, ఢిల్లీకి మూటలు మోయడానికే తప్ప సంక్షేమ పథకాలకు ఉపయోగించలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా కాలయాపన చేసి ప్రజల మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.