Anirudh Reddy | ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. పవన్ కళ్యాణ్‌ను ఒక ప్యాకేజ్ స్టార్ గా అభివర్ణించిన ఆయన, భవిష్యత్తులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గనుక ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆయనకు కూడా సపోర్ట్ చేయడానికి పవన్ వెనకాడరని ఎద్దేవా చేశారు.
ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావును విమర్శించే స్థాయి, అర్హత పవన్ కళ్యాణ్‌కు లేవని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయండి, అప్పుడు ఆయన ఇంటి ముందు అడ్డుగా నేను నిలబడతాను అంటూ పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డలను ముట్టుకోవాలని ఆంధ్ర నుండి ఎవరైనా ప్రయత్నిస్తే, ఇక్కడ తీవ్ర పరిణామాలు ఉంటాయని, ‘గో బ్యాక్ ఆంధ్ర’ ఉద్యమం మళ్లీ మొదలవుతుందని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల తీరుపై మండిపడుతూ.. “మీరంతా ఉండేది, ఆస్తులు సంపాదించుకునేది హైదరాబాద్‌లోనే కదా, మరి అన్ని వేల కోట్లు పెట్టి అమరావతిని ఎందుకు కట్టుకుంటున్నారు?” అని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికాడు.