హైదరాబాద్, నవంబర్22 (నమస్తే తెలంగాణ): విలువైన పారిశ్రామిక వాడల భూములను తనవారికి అప్పనంగా కట్టబెట్టాలనే ముఖ్యనేత ప్రతిపాదన మంత్రివర్గంలో మంటలు రేపిందా? ఈ విషయంలో మంత్రులు రెండుగా చీలిపోయారా? దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రులు ముఖ్యనేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారా? ఈ అంశంపై ఈ నెల 17న జరిగిన క్యాబినెట్ భేటీలో మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందా? ఇది అతిపెద్ద కుంభకోణంగా మారి ప్రజల్లో పార్టీని, ప్రభుత్వాన్ని పతనం చేస్తుందని హెచ్చరించారా? మంత్రులు వద్దన్నా ముఖ్యనేత మంకుపట్టుపట్టి ఆమోదముద్ర వేయించారా?.. అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అయితే పరిశ్రమల శాఖకు చెందిన ఇంత కీలక నిర్ణయాన్ని ఆ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాకుండా పొంగులేటి వెల్లడించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినప్పుడు సంబంధిత మంత్రి వాకిటి శ్రీహరిని పక్కన కూర్చొబెట్టుకున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిర్ణయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఇటీవలే గిగ్ వర్కర్ల పాలసీని సంబంధిత మంత్రి వివేక్ ప్రకటించారు. కానీ రూ.లక్షల కోట్ల విలువ చేసే ఇండస్ట్రియల్ భూముల కన్వర్షన్‌పై తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించే సమయంలో సంబంధిత మంత్రి లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. దీంతో మంత్రి శ్రీధర్‌బాబుకు అసలు ఈ విషయం తెలుసో? లేదో? అన్న చర్చ కూడా జరుగుతున్నది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు విమర్శలు చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఆయన స్పందించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పాలసీ ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో చిచ్చురేపినట్టు తెలుస్తున్నది. మెజార్టీ మంత్రులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి పారిశ్రామిక భూములపై ముఖ్యనేత ఎప్పుడో కన్నేసినట్టు చర్చ జరుగుతున్నది. 22 పారిశ్రామికవాడల్లోని 9292.53 ఎకరాల భూమిని గుర్తించి, వాటిని మల్టీపర్పస్ జోన్లుగా మార్చేలా పాలసీని రూపొందించి గోప్యంగా పెట్టినట్టు సమాచారం. రెండేండ్ల కాలంలో పాలనలో విఫలం కావడం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో పాలసీని తెరమీదికి తెచ్చే సాహసం చేయలేదట! అయితే ఇటీవల అడ్డదారులు, అడ్డగోలు రాజకీయాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యనేత ఇండస్ట్రియల్ భూములపై తన ప్లాన్‌ను అమల్లోకి తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడైతేనే మంత్రులెవరూ వ్యతిరేకించరని, ఈ గెలుపు ఊపులోనే కొట్టేయాలని భారీ స్కెచ్ వేసినట్టు సమాచారం.
ఇప్పటివరకు ప్రభుత్వంలో జరిగే మెజార్టీ పరిణామాలు, కీలక నిర్ణయాలన్నీ మంత్రులకు తెలియకుండా జరుగుతున్నాయనే చర్చ ఉన్నది. ముఖ్యనేత ఒక్కరే నిర్ణయాలు తీసుకొని వాటిని మంత్రుల ముందు పెడుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఇండస్ట్రియల్ భూముల విషయంలోనూ ఇదే జరిగినట్టు సచివాలయంలో చర్చ నడుస్తున్నది. భూములను కన్వర్ట్ చేయాలనే అంశం క్యాబినెట్లో కూర్చునేవరకు మెజార్టీ మంత్రులకు తెలియదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని చూసి అవాక్కవడం వారి వంతైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీన్ని గమనించిన పలువురు మంత్రులు భారీ కుంభకోణానికి పునాది వేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్లోనే పలువురు మంత్రులు ప్రశ్నించినట్టు సమాచారం.
ఇంత కీలకమైన అంశాన్ని ర హస్యంగా ఎందుకు ఉంచారని, తమకు ముందే ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించినట్టు చెప్పుకొంటున్నారు. అదేవిధంగా ప్రజా ప్రభుత్వంగా చెప్పుకొంటున్న మనం.. రూ.లక్షల కోట్లతో ముడిపడిన అంశంపై అసెంబ్లీలో చర్చించకుండా, ప్రజలకు వివరించకుండా ఏ విధంగా ముందుకెళ్తామని ప్రశ్నించినట్టు తెలిసింది. చివరికి వారి నోరు మూయించి క్యాబినెట్ ఆమోదముద్ర వేయించినట్టు చెప్పుకొంటున్నారు.
కొత్త పాలసీపై మెజార్టీ మంత్రులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట! క్యాబినెట్ భేటీ అనంతరం తన సన్నిహితుల వద్ద ఓ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘ఈ నిర్ణయం అసాధారణమైనది. ఈ నిర్ణయంతో భారీ కుంభకోణం జరిగేందుకు అవకాశం ఉన్నది. ముఖ్యనేత, తన అనుయాయులు, బిగ్ బ్రదర్స్ అంతా దోచుకునేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. 9,292 ఎకరాల భూమిని హెచ్ఐఎల్టీపీ పేరిట తమ వాళ్లకు కట్టబెట్టాలనే నిర్ణయం ప్రభుత్వానికి, పార్టీకి గుదిబండగా మా రడం ఖాయం. రూ 4- 5 లక్షల కోట్ల వ్యవహారం. వచ్చే ఎన్నికల్లో ఈ కుంభకోణమే ఎజెండా ఉంటుంది. తినేది వాళ్లు, తిట్లు మాకా? వారి కుంభకోణానికి మేము బలికావాలా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.