PM Modi : కాంగ్రెస్ పాలనలో దేశం నిరాశలోకి కూరుకుపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. 12 ఏళ్లు కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా ఉంచగలగడమే ఎన్డీయే అసలైన విజయమని ప్రధాని అన్నారు. ఎన్డీయే అధికారం చేపట్టి 12 ఏళ్లు పూర్తవడంతోపాటు మోదీ ప్రధానిగా అత్యధిక రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీయే పక్షాలతో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో బుధవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రధాని మోదీతోపాటు బీజేపీ అగ్రనేతలు, ఎన్డీయే కూటమి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే పాలన గురించి వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘‘ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. భారత మాతకు అత్యధిక కాలం సేవ చేసే అవకాశం కలగడం దేవుడిచ్చిన వరం. నాక ప్రజలే దేవుళ్లకు ప్రతిరూపాలు. ఈ ప్రేమకు కృతజ్ఞతలు. 2014కు ముందు కొన్ని దశాబ్దాలపాటు దేశంలో అస్తిరత, అశాంతి ఉండేది. కానీ, ఇప్పుడు దేశ ప్రజలు ఒక స్తిరమైన ప్రభుత్వాన్ని, నిర్ణయాత్మక సామర్ద్యాన్ని చూస్తున్నారు. దేశ ప్రజలకు నమస్కరిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 12 ఏళ్లు కాంగ్రెస్ పాలనకు దేశాన్ని దూరంగా ఉంచడమే ఎన్డీయే సాధించిన గొప్ప విజయం.
కాంగ్రెస్ తన పాలనలో దేశాన్ని నిరాశ, బలహీన స్థితిలోకి నెట్టింది. దేశం నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని, వేగంగా అభివృద్ధి చెందడం కాదని ప్రజలు నమ్మేవారు. దేశం నెమ్మదిగా అభివృద్ధి చెందడాన్ని కాంగ్రెస్ నేతలు హిందూ అభివృద్ధి రేటుగా చెప్పేవారు. పని కాంగ్రెస్‌దే.. బాధ్యత కాంగ్రెస్‌దే.. వైఫల్యం కూడా కాంగ్రెస్‌దే.. కానీ, దీనికి కారణం మాత్రం హిందూ జనాభా అని చెప్పారు” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం తన పూర్తి శక్తి సామర్ద్యాలకు అనుగుణంగా పని చేస్తోందన్నారు.