మక్తల్, జనవరి 16; రాజకీయం పేరుతో జూదం రాజ్యమేలడం, కాంగ్రెస్ నేతలు నిషేధిత కోడిపందాలు నిర్వహించిన సంఘటన మక్తల్ మండలం భూత్పూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజులపాటు మక్తల్ మండలం భూత్పూర్ గ్రామంలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నిషేధిత కోడిపందాలను భారీ స్థాయిలో పోటీలు నిర్వహించి, పెద్ద ఎత్తున బెట్టింగులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. ప్రజలకు చట్టాలు పాటించాలని ఉపన్యాసాలు ఇచ్చే నేతలే, తెర వెనుక నిషేధిత జూదానికి అండగా నిలవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోందని మండల ప్రజలు వాపోతున్నారు.
రాష్ట్రంలో నిషేధం లో ఉన్నటువంటి కోడిపందాల జూదాన్ని, రాజకీయ అండతో పాటు భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు భారీగా వచ్చాయి. మక్తల్ మండలం భూత్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, తమ పార్టీకి చెందిన బడా నాయకుని అండదండలతో పోలీసుల కనుసైగల్లో, గ్రామానికి సమీపంలో భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహించారని సమాచారం. కోడిపందాలు ఎవరైనా పెడితే అట్టివారిని చట్టపరంగా శిక్షిస్తామని, గత మూడు రోజుల కిందటే మక్తల్ పోలీసులు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోడిపందాలు ఆడుకునేందుకు ఉసిగొల్పారా? అని జనం చర్చించుకుంటున్నారు.
మక్తల్‌కు సమీపంలోని భూత్పూర్ గ్రామంలో ఇంత భారీ ఎత్తున కోడిపందాలు జరుగుతుంటే పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ కోడిపందాలకు రూ. వేల నుంచి లక్షల రూపాయల వరకు పందాలు సాగినట్టు అంచనా. కోడిపందాల కార్యక్రమాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులే నిర్వాహకులుగా వివరించడంతో పోలీస్ శాఖకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత కోడిపందాలు ఆడిపిస్తున్న వారిపై పోలీస్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల, తమ వెనుక బడా నేత ఉన్నాడనే ఉద్దేశంతో నాయకులు భారీ స్థాయిలో కోడిపందాలను నిర్వహించి భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా,యువజన సర్వీసులు, మత్స్య అభివృద్ధి శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ఇలాకాలో నిషేధిత కోడిపందాలు ఇంత భారీ ఎత్తున జరగడం చూస్తుంటే, వీరికి నిషేధిత పందాలను రూపుమాపడంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పాటు, ప్రజా పాలనలో ఎవరు ఏమైనా చేయొచ్చు అని సంకేతాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సృష్టిస్తున్నారని ఆరోపణలు ప్రజలనుండి భారీగానే వినిపిస్తున్నాయి. ఇట్టి సంఘటనపై మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డిని వివరణ కోరగా, పండగ సమయంలో సెలవులో ఉన్నాను కాబట్టి ఎలాంటి సమాచారం తనకు అందలేదని ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.