BRS | పోతంగల్: కాంగ్రెస్ పార్టీ రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ (BRS) నాయకులు కోరారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బుధవారం పోతంగల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. తమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై విమర్శలు చేసే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని గుర్తు చేశారు. హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమంపై సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ సహకారంతోనే పోతంగల్ (Pothangal) మండలం ఏర్పాటైందని తెలిపారు. మండల ఏర్పాటు ద్వారా పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మండల స్థాయిలో వివిధ పదవులు, ప్రజాప్రతినిధుల అవకాశాలు అందుబాటులోకి రావడానికి మండలం ఏర్పాటు దోహదపడిందని వెల్లడించారు.
బాన్సువాడ (Banswada) ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్న సమయంలో పోతంగల్ మండల పరిధిలో మంజీర నదిపై వంతెన నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. వంతెన అందుబాటులోకి రావడంతో మహారాష్ట్రతో రాకపోకలు సులభమై, పోతంగల్ ప్రాంతంలో రవాణా, వ్యాపార కార్యకలాపాలు పెరిగాయని తెలిపారు. ప్రాంత అభివృద్ధికి ఈ వంతెన కీలకంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను కొనసాగించడంతోపాటు కొత్తగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుధం నవీన్, తేల రవికుమార్, మోరే కిషన్, ఆరిఫ్, ఎజాజ్, సుధం సాయిలు, సురేశ్, హన్మంతు, అఫ్రోజ్, జలాల్, గణేశం, సాగర్ పాల్గొన్నారు.