మహబూబ్‌నగర్, జూలై 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆయన ఓ కాంగ్రెస్ నేత.. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘానికి చైర్మన్. రైతులకు సహకారం అందించాల్సింది పోయి పీఏసీఎస్‌ను తన జేబుసంస్థగా మార్చేశారు. సొసైటీ సొమ్ముతో దర్జాగా నగానట్ర కొన్నారు. అడ్డగోలుగా లక్షలు ఖర్చుచేశారు. కాంట్రాక్టర్ అవతారమెత్తి కోట్లాది నిధులు గోల్మాల్ చేశారు. ఆయనకు అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో విచారణ జరిపేందుకు అధికారులు జంకుతున్నారు. ఆయన బండారం బయటపెట్టేందుకు ప్రయత్నించిన ‘నమస్తే తెలంగాణ’పై బెదిరింపులకు దిగారు. ఈ తతంగం ఎక్కడో మారుమూలన జరిగింది కాదు. స్వయానా సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోని బాదేపల్లి పీఏసీఎస్‌లో జరిగింది.
ఉమ్మడి మహబూనగర్ జిల్లాలో బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి మంచిపేరు, పలుకుబడి ఉండేది. అయితే అధికార పార్టీకి చెందిన చైర్మన్ కొంతకాలంగా సొసైటీ సొమ్మును సొంతానికి వాడుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ ఏకంగా రూ.67లక్షలు వాడుకున్నట్టు బయటపడింది. మొత్తం 15 చెక్కుల ద్వారా భారీ మొత్తంలో సొమ్మును తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, చివరికి కారు డ్రైవర్‌కు చెల్లించినట్టు తేలింది. హైదరాబాద్‌లోని ఓ జ్యువెల్లరీ షాప్‌నకు సొసైటీ ఖాతా నుంచి రూ.10 లక్షల చెక్కు రాసి ఇచ్చారని, తన భార్యకు, అన్న కొడుకుకు రూ.15.70 లక్షలు, కారు డ్రైవర్‌కు రూ.3.58 లక్షలు చెల్లించారని, మరో రూ.2.50 లక్షలు సొంతానికి వాడుకున్నారని వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ నేత కావడంతో అధికారులు విచారణకు వెనుకాడుతున్నారు. ఆడిటింగ్‌కు వచ్చిన అధికారులు సైతం ఆయనతో చేతులు కలిపారని, చెక్కుల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచారని స్థానికులు అంటున్నారు.

బాదేపల్లి పీఏసీఎస్‌కు నాబార్డ్ కింద గోదాము నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. సర్వే నెంబర్ 83లో ఐదెకరాల 36గుంటల భూమిని కూడా కేటాయించింది. అయితే ఈ భూమిని తానే కొనుగోలు చేశానని చైర్మన్ సొసైటీలో నమ్మించారు. 2,500 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, ఆయనే ఈ కాంట్రాక్టును కొట్టేశారు. కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.1.47 కోట్లు విడుదల చేసింది. పీఏసీఎస్ వాటా కింద రూ.31,27,281 చెల్లించారు. దీంతో మొత్తం రూ.1,78,49,441 ఖర్చు చేసినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే గోదాం నిర్మాణం పేరుతో భారీ అక్రమాలకు పాల్పడినట్టు చెప్తున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం గోదాం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాలి.
కానీ సొసైటీ చైర్మన్ ఇదేమీ చేయకుండా, తానే నిర్మాణం చేపట్టానని, కిందిస్థాయి సిబ్బందిని బెదిరించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను యథేచ్ఛగా వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. నిర్మాణానికి రూ.1.78 కోట్లు వ్యయం అయినట్టు ఆయన చెప్తున్నారని, వాస్తవానికి రూ.70 లక్షలకు మించి ఖర్చు కాలేదని ప్రచారం జరుగుతున్నది. మిగతా నిధులను బంగారం కొనుగోలుకు, కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లమీద చెక్కులు విడుదల చేశారని తేలింది. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉ న్నాయనే ప్రచారం జరుగుతున్నదని, అం దుకే అవినీతిపై ఆడిటింగ్ జరుపడం లేదని చెప్తున్నారు. మక్క రైతులనూ మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన ‘నమస్తే తెలంగాణ’కు నోటీసులు ఇస్తామని ఆయన బెదిరింపులకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని బాదేపల్లి సహకార సంఘంలో జరుగుతున్న గోల్‌మాల్‌పై విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
