Ex MLA sathish Kumar | చిగురుమామిడి, డిసెంబర్ 4 : హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని, అయినప్పటికీ 96శాతం రిజర్వాయర్ పనులు పూర్తి చేసి అందులో ఒక టీఎంసీ వరకు నీళ్లు నింపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుర్చీ వేసుకొని గౌరవల్లిని పూర్తి చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ నిరూపించుకున్నాడన్నారు.
రిజర్వాయర్ కాలువల సేకరణ నిర్మాణానికి సంబంధించిన రూ.200 కోట్లు కేటాయించిన విషయాన్ని నియోజకవర్గ ప్రజలు మర్చిపోరన్నారు. కాలువలకు రూ.437 కోట్లు కేటాయించినట్లు చెప్పుకోవడం తప్పా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తట్టడి మట్టి కూడా తీయలేకపోయారని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ముందు పాదయాత్రలో భాగంగా గండిపల్లిని సందర్శించి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తారని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లు గడిచిన గండిపల్లి ఊసు కూడా ఎత్తలేదన్నారు. 2014 ముందు హుస్నాబాద్ పట్టణం ఎలా ఉండేదని అనంతరం ఎలా మారిందని ప్రజలందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని అనడం విడ్డూరమని, సీఎం, మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఎలాంటి అభివృద్ధి జరగనిదే హుస్నాబాద్ పట్టణానికి జాతీయ అవార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గం తో పాటు సాధ్యమైనంత అభివృద్ధి చేశామే తప్ప, ఏనాడూ కమిషన్ లకు కక్కుర్తి పడలేదని చెప్పారు. దమ్ముంటే ఆరు నెలల్లో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక 420 హామీలను నెరవేర్చలేక గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓడిపోతామని భయంతోనే సీఎం జిల్లా పర్యటన చేస్తూ బహిరంగ సభలు పెడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి కోసమే తప్ప సీఎం బహిరంగ సభలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.5649 కోట్ల అభివృద్ధి, రూ.3427 కోట్ల సంక్షేమాన్ని అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. గౌరవెల్లి భూ నిర్వాసితులను రెచ్చగొట్టి ఎకరాకు రూ.30 లక్షల పరిహారం ఇప్పిస్తానని చెప్పిన మంత్రి పొన్నం ఇప్పుడు కేవలం రూ.15 లక్షలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఈ సమావేశంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎంపీపీలు మానస, మంగ, అన్వర్ ఫాషా, సుద్దాల చంద్రయ్య, గంగం మదన్ మోహన్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, గంగం రజిత, చిగురుమామిడి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, పెనుకుల తిరుపతి, బెజ్జంకి లక్ష్మణ్, ఎండి సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, పన్యాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.