హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లంబాడీలను వేధిస్తున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఫార్మా కంపెనీల పేరుతో సీఎం సొంత నియోజకవర్గంలోని రైతులు, ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. లంబాడీల భూములను అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలోని రోటిబండ తండా పంచాయతీ పరిధిలోని ఐదు తండాలు, లగచర్ల, పీర్లపల్లి, తదితర గ్రామాల ప్రజల భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని అధికారులు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. సమాచారం లేకుండా సోమవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్, 500 మంది పోలీసులతో తండాలపై దాడులు చేశారని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో గిరిజనులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని తెలిపారు.