హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : స్కిల్ యూనివర్సిటీ కోసం కాంగ్రెస్ సర్కార్ పాలిటెక్నిక్ కాలేజీలకు ఉరి బిగిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ దుర్మార్గంతో పేదబిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫోర్త్‌సిటీలోని భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. స్టూడెంట్స్ పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. జనతాగ్యారేజ్లా మారిన తెలంగాణ భవన్ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి విమానాలెక్కి లండన్, అమెరికాల్లో చక్కర్లు కొడుతుంటే, కాలేజీల్లో చక్కగా చదువుకోవాల్సిన పిల్లలు రోడ్లపైకి ఎక్కాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీఈ రాసి ఇంజినీరింగ్ చదివితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంది? రేవంత్‌రెడ్డి వనపర్తి కాలేజీలో పాలిటెక్నిక్ చదివి హైదరాబాద్‌కు వచ్చి బీఏ చదవలేదా? అని ప్రశ్నించారు. శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లాలో ఆందోళనకు దిగిన పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతుపట్టి సీఐ రఘుపతి చంపేప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారిని వి ధుల నుంచి తొలగించాలని కోరారు.
గద్దెనెక్కినప్పటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి పైసలపై ధ్యాసపెడుతూ విద్యాశాఖను విస్మరిస్తున్నారని ప్రవీణ్‌కుమార్ నిప్పులుచెరిగారు. ఆకునూరి మురళి సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం జీవో 97 జారీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు సమస్యలు మొరపెట్టుకున్న పాలిటెక్నిక్ విద్యార్థులను బెదిరించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కండ్లు తెరిచి జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ ఉ ధృతపోరాటం చేస్తుందని హెచ్చరించారు.
కారుణ్య నియామకాల కింద నియమితులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామని జీవో 81, 85 జారీ చేసిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం మొండిచెయ్యి చూపుతున్నదని ఆర్ఎస్పీ మండిపడ్డారు. వారి తరఫున ఆందోళనకు ఉపక్రమిస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. గురువారం తెలంగాణభవన్‌లో వీఆర్ఏలు ఆర్‌ఎస్‌సీని కలిసి వినతిపత్రం అందించి గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగోన్నతుల విషయమై మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్తే ఆ జీవోలు చిత్తుకాగితాలతో సమానమని అంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఆం దోళనకు మద్దతివ్వాలని విజ్ఞప్తిచేశారు. ఇం దుకు ఆయన సానుకూలంగా స్పందించా రు. పార్టీ నాయకత్వంతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
పాలిటెక్నిక్ విద్యను సర్వనాశనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ విరుచుకుపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత అభిలాష్ రంగినేనితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీకి వీసీగా నియమించిన వ్యక్తికి కనీస అర్హతలు లే వని, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపించారు. చదువుకోనివాళ్లు అధికారపీఠమెక్కి..విద్యారంగాన్ని బలిపీఠమెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. జీవో 97 రద్దు చేయకుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పతనం అక్కడినుంచే ప్రారంభమవుతుందని హెచ్చరించారు.