హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram project ) పై కాంగ్రెస్ చేసిన ఘోరాతి, ఘోరమైన గోబెల్స్ ప్రచారం (Goebbels Propaganda ) హైకోర్టు తీర్పుతో పటాపంచలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు. నిజం నిలకడ మీద తేలుతుందనే నానుడిని ఈ తీర్పుతో హైకోర్టు మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ఈ తీర్పునిచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం కరువు ఉంది అనగానే కాళేశ్వరమే కల్పతరువని గ్రహించిన రేవంత్ రెడ్డి మేడిగడ్డకు పరుగులు పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం రేవంత్ రెడ్డికి ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుందని వివరించారు. ఇవ్వాళ కూలింది కాళేశ్వరం కాదని, కేసీఆర్ మీద కాంగ్రెస్ చేసిన కుట్రలు, అబద్ధాలు, మోసపూరిత గారడీలు కుప్పకూలాయని స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పుతో నిజం నిరూపితమై, కాళేశ్వరం కాలర్ ఎగరేసి నిటారుగా నిలబడ్డదని అభివర్ణించారు. కాంగ్రెస్ కక్కుర్తికి ఎస్ఎల్బీసీ (SLBC )కుప్పకూలి అక్కడ పనిచేస్తున్న కార్మికులు జల సమాధి అయిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఇప్పటికీ వాళ్ల శవాలు బయటికి తీయలేదని, ఇది కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం కాదా? అంటూ ప్రశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆగమేఘాల మీద స్పందించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూలిన ప్రాజెక్టుల పైన ఎందుకు స్పందించ లేదని అన్నారు.
ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ మద్దతు
ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నారని, తక్షణమే ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.