హైదరాబాద్, ఫిబ్రవరి 10: ప్రముఖ ఎలివేటర్ల తయారీ సంస్థ కోన్ ఎలివేటర్ ఇండియా..తాజాగా దక్షిణాది మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి హైదరాబాద్‌లో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను గురువారం ఆరంభించింది. ఈ సెంటర్లో కంపెనీకి చెందిన ఉత్పత్తులతోపాటు వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల సేవలు లభించనున్నాయి. ఈ సెంటర్‌తో తెలంగాణ వ్యాప్తంగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోస్సైన్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో విక్రయాలు, ఇన్స్టాలేషన్, సర్వీసులు, ఏఎంసీ, కస్టమర్లు కోరుకుంటున్న అన్ని రకాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. దక్షిణాదిలో ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని ఆయన చెప్పారు.
తెలంగాణకు క్యూ కడుతున్న సంస్థలు
దేశంలో అతి పిన్న వయస్సు కలిగిన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం వ్యాపార సంస్థలకు కేంద్ర బిందువుగా మారిందని అమిత్ చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణం, అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా, అత్యుత్తమ లా అండ్ ఆర్డర్ వంటి అంశాలతో అతి ప్రధానమైన ఐటీ కేంద్రంగా భాగ్యనగరం వెలుగొందుతున్నదని తెలిపారు. అంతేకాదు, ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్‌లో అగ్రగామి రాష్ర్టాల సరసన తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఎలివేటర్లకు డిమాండ్ ఉంటుందని ఆయన అంచనావేస్తున్నారు.