హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram Project ) లో భాగంగా 21 ప్యాకేజ్ పనులను పూర్తి చేసి సాగు వెంటనే సాగు నీరందించాలని మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం శాసన సభ సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో బాల్కొండ నియోజకవర్గం ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్యాకెజ్ 21 , చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను లేవనెత్తారు.
ఈ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటికే 3,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 70 శాతం పనులు పూర్తి చేశామని వెల్లడించారు. మిగిలిన 30శాతం పనులు పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని సూచించారు.
ఇందులోనే భాగమైన మెట్పల్లి సెగ్మెంట్ ప్యాకేజీ 21 ఏ లోనే బాల్కొండ నియోజకవర్గంలో 70వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్ జక్రాన్ పల్లి మండలంలో 29వేల ఎకరాలు, కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి, ఇబ్రహీపట్నం ప్రాంతంలో 19వేల ఎకరాలు, ఆర్మూర్, మాక్లూర్ లో 5వేలు ఎకరాలు మొత్తంగా సుమారు 1.20 లక్షల ఎకరాలు ఉంటుందని వివరించారు.
ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల మెట్పల్లి సెగ్మెంట్ పనులల్లో హెడ్ వర్క్స్, పంపు హౌజ్, మెయిన్ పైప్ లైన్ పూర్తి అయ్యి దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం మరో రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే 1.20 లక్షల ఎకరాలకు 3 నుంచి 6 నెలల్లో నీరు అందించవచ్చని సూచించారు. మరో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే మిగతా 80వేల ఎకరాలకు సాగున్నీరు అందించవచ్చనివెల్లడించారు.
ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబదించిన చిట్టాపూర్-ఫతేపూర్-సుర్బిర్యాల్ లిఫ్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. గత రెండున్నర ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయని , తక్కువ ఖర్చుతోనే ఒక్క ఎకరానికి సాగునీరు అందించే అవకాశం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉందని తక్షణమే ఈ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిని పలుసార్లు కలిసి విన్నవించడమే కాకుండా గత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పనుల్లో ఇప్పటికి ఎలాంటి కదలిక లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పనుల్లో వేగం పెంచి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.