హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి పాలనను పక్కనబెట్టి పక్కా బ్లాక్ మెయిలర్లా మారారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ ఆరోపించారు. అన్నివర్గాలను బెదిరించి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం చేతగాక ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. గురువు చంద్రబాబు బాటలోనే ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇంజినీరింగ్ చదివిన ఐఏఎస్ అధికారుల మధ్య భవిష్యత్ ఇంజినీర్లను అవమానించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వందల కోట్లు వెచ్చించి నిర్వహించిన అందాల పోటీలు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు క్రిమినల్ వేస్ట్ కావా? నీ హార్వర్డ్ విద్యకు వెచ్చిన సర్కారు సొమ్ము వృథాకాదా? అని ప్రశ్నించారు. సుసంపన్నమైన రాష్ర్టాన్ని క్యాన్సర్, ఎయిడ్స్ రోగులతో పోల్చిన దౌర్భాగ్యపు సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ముఖ్యమంత్రికి అందరినీ కించపరచడం..బూతులు తిట్టడం తప్ప ఇంకేం చేతకాదని నిప్పులు చెరిగారు.
70 వేల ఉద్యోగాలిచ్చానని రేవంత్ పదే పదే అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పింది నిజమైతే తన సవాల్‌ను స్వీకరించాలని స్పష్టంచేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు.