పాలమూరు, ఆగస్టు 1 : తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థ యోధుడిగా పేరొంది.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్న ప్రజా నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి తెలంగాణకు తీరనిలోటని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు నేతలు, ప్రముఖులు పెద్ది చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి వెంట శాసన మండలి సభ్యుడు కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రవాస భారతీయ ప్రముఖులు మహేశ్, అమర్నాథ్, బాను ఇల్లెందుల ఉన్నారు.
పెద్దికి ఎన్నారైల సంతాపం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ యునైటెడ్ స్టేట్స్ బృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఈ బృందం నిర్వహించిన ఆన్లైన్ జూమ్ సంతాప సభలో అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి సుమారు 1,000 మందికిపైగా ఎన్నారై తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, చికాగో, న్యూయార్, లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, ఫిలడెల్ఫియా, సాన్ ఆంటోనియో, సాన్ డియాగో, కనెక్టికట్, బోస్టన్, కొలంబస్, డెలావేర్, వర్జీనియా తదితర ప్రాంతాల వాళ్లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. అమెరికాలోని తెలంగాణ సమాజం తరఫున పెద్ది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.