ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 28 : మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్‌ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఇన్చార్జి డీఈవో యాదయ్యతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 6,779 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఉపాధి అవకాశాలు కల్పించాలి
నిరుద్యోగ యువతకు నైపుణ్యతపై శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకునేలా యువతను ప్రోత్సహించాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద యువతకు శిక్షణ అందించాలని, జిల్లాలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలి
ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న సిమెంట్ పనులను మార్చి నెలాఖరుకల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బానోత్ దత్తారాంతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిషనర్ ఉదయ్ బాబు, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్, జిల్లా రవాణాశాఖ అధికారి రామ్‌చందర్, డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అశోక్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, పంచాయితీ రాజ్ ఈఈ. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.