న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. గతంలో నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్స్ గెలిచినా ఇటీవల కాలంలో స్థాయికి తగ్గట్టు ఆడటంలో తడబడుతున్న జపాన్ భామ, 23వ సీడ్‌గా బరిలోకి దిగిన నవొమి ఒసాకా ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో 2023 చాంపియన్ కోకో గాఫ్నకు షాకిచ్చి క్వార్టర్స్ చేరింది. సోమవారం అర్ధరాత్రి ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఒసాకా.. 6-3, 6-2తో మూడో సీడ్ గాఫ్‌ను మట్టికరిపించి 2021 తర్వాత ఈ టోర్నీలో లాస్ట్ 8 దశకు అర్హత సాధించింది. క్వార్టర్స్‌లో ఒసాకా 11వ సీడ్ చెక్ ప్లేయర్ కరోలినా ముచోవాతో తలపడనుంది. మరో పోరులో ఇగా స్వియాటెక్ (పోలండ్) 6-3, 6-1తో అలగ్జాండ్రోవా (రష్యా)ను ఓడించి క్వార్టర్స్ చేరుకుంది. ఆమెతో పాటు అమెరికా అమ్మాయి అమంద అన్సిమొవ సైతం క్వార్టర్స్‌కు ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్, లైలా ఫెర్నాండెజ్ (కెనడా) ద్వయం 6-3, 6-4తో అలగ్జాండ్రొవ (రష్యా), ఝాంగ్ షువాయ్ (చైనా)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది.
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ, మైఖెల్ వీనస్ జోడీ ప్రిక్వార్టర్స్ చేరింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో ఈ ఇండో అమెరికన్ ద్వయం 6-1, 7-5తో గొంజాలొ ఎస్కోబార్ (ఈక్వెడార్), రేయెస్ వరెల (మెక్సికో)ను ఓడించింది.
ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం అంటారు! దీన్ని నిజం చేస్తూ యూఎస్ ఓపెన్‌లో ఇటలీ భామ జాస్మిన్ పౌలోని అదిరిపోయే ఫ్రేమ్‌లో బందీ అయిపోయింది. ఫొటోగ్రాఫర్ రే జిబిలో తీసిన ఈ ఫొటో టోర్నీకే హైలెట్‌గా నిలిచింది. ‘వన్ ఇన్ ఏ మిలియన్’ ఇమేజ్ను తలపిస్తూ పౌలోని ముఖం రాకెట్లో అలా అతికినట్లు సరిపోవడం అందరినీ ఆకట్టుకుంటున్నది.
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సిన్నర్ తుది ఎనిమిదిలోకి చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో ఈ ఒకటో సీడ్ ఇటలీ కుర్రాడు 6-1, 6-1, 6-1తో అలగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)పై అలవోక విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో లొరెంజొ ముసెట్టి (ఇటలీ) 6-3, 6-0, 6-1తో జామె మునర్ (స్పెయిన్)ను చిత్తుచేశాడు. క్వార్టర్స్‌లో సిన్నర్.. తన దేశానికే చెందిన ముసెట్టితో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఫెలిక్స్ అగర్ అలీఅస్సీమ్ (కెనడా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) కూడా తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్స్ చేరుకున్నారు. క్వార్టర్స్‌లో ఫ్రిట్జ్.. జొకోవిచ్‌తో తలపడనున్నాడు