మియాపూర్, ఆగస్టు 12: పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించేందుకే వినూత్నంగా వన్డే వన్ వార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన పేర్కొన్నారు. వన్డే వన్ వార్డు కార్యక్రమంలో భాగంగా మియాపూర్ సర్కిల్ పరిధిలోని డీకే ఎన్‌క్లేవ్‌లో ఎమ్మెల్యే గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిమీత్, డీసీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ సహా ఇతర అధికారులు, కాలనీ ప్రతినిధులతో కలిసి బుధవారం ఆమె పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు రహదారులకు మరమ్మతులు, నూతన రహదారుల నిర్మాణం, వీధి దీపాలు, డీసిల్టింగ్, వీధి దీపాలు, ట్రాఫిక్ నిర్వహణ సహా పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సృజన మాట్లాడుతూ.. నిర్దిష్ట కాలపరిమితిలోగా సమస్యలను పరిష్కరించడంతో పాటు నూతన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, కాలనీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.