మహబూబ్నగర్ : డాక్టర్. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించారన్నారు.
ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందించి వారు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రోత్సాహకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
దేశంలో అంబేద్కర్ తర్వాత దళితుల అభివృద్ధి గురించి ఆలోచించిన ఏకైక నేత సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్శింహులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా దళిత సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.