హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గంగా జమున తెహజీబ్‌కు వేదికగా, మత సామరస్యానికి చిహ్నంగా నేడు తెలంగాణ రాష్ట్రం నిలిచిందని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు అన్నారు. నూతన సచివాలయ ప్రాంగణంలో 500 గజాల స్థలంలో రూ.1.5 కోట్లతో చేపట్టిన చర్చి నిర్మాణానికి మెదక్ డయసిస్ బిషప్ రెవరెండ్ ఏసీ సాల్మన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు గురువారం శంకుస్థాపన చేశారు. బిషప్ సాల్మన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సర్వమత సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సచివాలయంలోని చర్చి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. సాల్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లౌకికవాదాన్ని కాపాడుతూ అన్ని మతాలవారిని సమానంగా చూస్తున్నారని కొనియాడారు. చర్చి నిర్మాణ ఖర్చులను ప్రభుత్వమే భరించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ఆరిటెక్ట్స్ అండ్ బిల్డింగ్స్) సుద్దాల సుధాకర్ తేజ, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.