హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ తుది అంకానికి చేరింది. సోమవారం రాత్రి నుంచే ఉద్యోగుల కేటాయింపు మొదలుకాగా, మంగళవారం మరికొన్నిశాఖల్లో అలాట్మెంట్ ఆర్డర్స్ జారీచేశారు. 8 జిల్లాల్లో జిల్లాస్థాయి ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. మంగళవారం రాత్రికి అన్నిశాఖల్లోని ఉద్యోగులకు కేటాయింపు ఉత్తర్వులు జారీచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలందాయి. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా సాగుతున్న ఈ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బుధవారం తెల్లవారేలోపు మొత్తం ప్రక్రియ పూర్తికానున్నది.
మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం: సీఎం కేసీఆర్
ఉద్యోగుల కేటాయింపులో మారుమూల ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. సాధారణ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఈ విధానం అనుసరించాలని సూచించినట్టు తెలిసింది. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియను సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్షించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది.
ఉద్యోగులంతా కేటాయింపు ప్రకారం ప్రస్తుతం రిపోర్ట్ చేయాలని, వచ్చే ఏడాది జూన్ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి కొత్త జిల్లాల ప్రకారం సర్దుబాటుకు అవకాశం కల్పిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చెప్పినట్టు సమాచారం ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులో సీనియారిటీ కాకుండా ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా సీనియారిటీని లెక్కించాలని, భార్యాభర్తలు, వికలాంగులు, అనారోగ్య సమస్యలున్నవారికి ప్రాధాన్యమివ్వాలని సూచించినట్టు అధికారులు తెలిపారు. టీచర్ల ఖాళీలున్నచోట విద్యావలంటీర్లను నియమించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల కేటాయింపులో భాగంగా మంగళవారం సచివాలయంలో దేవాదాయ, పౌరసరఫరాలు, ఇరిగేషన్, ఆర్‌డబ్లూఎస్, సైనిక సంక్షేమం, సహకారశాఖల ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి కేటాయింపులు చేపట్టారు. ఉద్యోగులంతా తమతమ స్థానాల్లో రిపోర్టు చేసిన తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.
హెచ్ఎం సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు..
పాఠశాల విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనతో పలు సంఘాల నేతలు సమావేశమై చర్చించారు. జాయినింగ్ తేదీ ఆధారంగా కాకుండా స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆధారంగా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయాలని సంఘాల నేతలు కోరారు. ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలను తర్వాత పరిశీలిస్తామని, ప్రస్తుతానికి కేటాయింపు సజావుగా జరిగేందుకు సహకరించాలని శ్రీదేవసేన కోరినట్టు తెలిసింది.