అపర భగీరథుడి రాకతో తన్మయత్వానికి గురైంది కరువు నేల. నెర్రెలిడిన ఈ నేలను గోదావరి జలాలలో తడిపేందుకు పూనుకున్నారు జలప్రదాత. వలసలకు పేరొందిన ఈ ప్రాంతంలో ఇక జలసవ్వడులు చేయనున్నాయి. సందడి కనిపించనున్నది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ సంగారెడ్డి, ఫిబ్రవరి 21: మహోజ్వల ఘట్టానికి వేదికైంది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్. కరువు కాటకాలు, వలసలను దూరం చేస్తూ.. భవిష్యత్‌కు భరోసానిస్తూ.. నవశకానికి నాంది పలుకుతూ.. జలప్రదాత సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసి పులకించింది ఈ ప్రాంత జనం. గుక్కెడు తాగునీటికి తండ్లాడిన ఈ పల్లెల్లో మిషన్ భగీరథ జలాలు గొంతు తడుపుతుండగా, నెర్రెలిడిన ఈ ప్రాంత భూములను తడిపేందుకు గోదారమ్మ పరుగులు తీయనున్నది. ఇదెంతో దూరంలో లేదు. మరికొన్ని నెలల్లోనే సాకారం కానున్నది. సాగునీరు లేక.. కాలం కలిసిరాక.. అన్నమో రామచంద్రా..! అంటూ వలస వెళ్లిన ఈ ప్రాంత ప్రజలకు అభయమిచ్చారు అపరభగీరథుడు కేసీఆర్. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేశారు. గోదారి జలాల రాకతో కరువు నేల సంగారెడ్డి ప్రాంతం సస్యశ్యామలం కానున్నది. బంగారు పంటలు పండించి సగౌరవంగా బతకనున్నారు ఈ ప్రాంత అన్నదాతలు.
మంత్రిపై ప్రశంసలు.. జిల్లాలకు వరాలు..
ఎత్తిపోతల నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావుపై ఆయన ప్రశంసలు కురిపించారు. జిల్లాలోని నాటి, నేటి పరిస్థితులను గుర్తుచేశారు. గంగకత్వ వాగు ఎలా ఉందని ప్రజలను అడిగారు. మంత్రి హరీశ్‌రావు వినతి మేరకు సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.50కోట్లు, మిగతా ఆరు మున్సిపాలిటీలకు 25కోట్ల చొప్పున సీఎం కేసీఆర్ నిధులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి మంగళవారమే జీవో జారీ చేస్తామని చెప్పారు. అలాగే, తండాల సమస్యలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారం పది రోజుల్లో సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభానికి రానున్నానని, అప్పుడు ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని దర్శించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొనగా, కరత్వాల ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమంలో మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, నారాయణఖేడ్, అందోల్, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’
ఎన్నో ఏండ్ల కల సాకారమవుతుండడంతో ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ నినాదాలతో నారాయణఖేడ్‌లోని సభా ప్రాంగణం హోరెత్తింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు, పార్టీశ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరాగా, కార్యక్రమం ఆద్యంతం విజయవంతమైంది.