హైదరాబాద్/జనగామ, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ)/దేవరుప్పుల/పాలకుర్తిరూరల్: పంచాయతీరాజ్‌శాఖ అధికారులు అద్భుతంగా పని చేస్తూ.. పల్లెప్రగతితో మంచి ఫలితాలు సాధిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు సిబ్బందిని అభినందించారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒకప్పుడు వెనుకబడ్డ తెలంగాణ అని, బ్యాక్వర్డ్ రీజియన్ అని పేర్కొనేవారని, స్వరాష్ట్రంలో పరిస్థితి మారిందని వివరించారు.
పదింటిలో తొమ్మిది జిల్లాలను ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాక్వర్డ్ కింద పరిగణించేదని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రం దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తే అభివృద్ధి చెందిన టాప్ 10 గ్రామాల్లో ఏడు తెలంగాణకు చెందినవే ఉండటం గర్వకారణమన్నారు. ఇందుకు కృషిచేసిన మంత్రి ఎర్రబెల్లి, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీరాజ్ సిస్టమ్‌లో పనిచేస్తున్న జడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరికీ సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.
సాగునీరిచ్చిన మహాత్ముడు కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగైందని, ప్రతి ఎకరాకు నీరు అందించిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. జనగామ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉపాధి పథకంలోనూ రాష్ర్టాలకు అధికారాలను తగ్గించి నీరుగార్చిందని మండిపడ్డారు. పాలకుర్తి టూరిజం కారిడార్‌కు నిధులిచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. జనగామకు మెడికల్ కాలేజీ, పాలకుర్తికి డిగ్రీ కాలేజీ, కొడకండ్లకు టెక్స్టైల్స్ పార్కు, సన్నూరు వేంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరుచేయాలని సీఎంను కోరారు.