న్యూఢిల్లీ, జూలై 10 : ఒక దేశం, ఒక ఎన్నిక సంస్కరణను 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమల్లోకి తెచ్చేలా ఒక విధానాన్ని రూపొందించే పనిలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఉందని ఆ కమిటీ చైర్పర్సన్ పీపీ చౌదరి తెలిపారు. ఇప్పటి వరకు సంప్రదించిన పౌర సమాజ భాగస్వాములలో దాదాపు 99 శాతం మంది ఈ ప్రతిపాదనను సమర్థించారని శుక్రవారం ఆయన చెప్పారు. గోవాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న కమిటీ అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన ఒక విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. రాజకీయ పార్టీ లు, ముఖ్యమంత్రులు తమ ఎన్నికల షెడ్యూళ్లను సమన్వయం చేసుకోవడానికి స్వచ్ఛందంగా అంగీకరిస్తే 2029 కంటే ముందే కొన్ని రాష్ర్టాలను కూడా దీని పరిధిలోకి తీసుకురావచ్చని ఆయన అన్నారు.
రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు 2024పై గోవాలో చర్చలను ప్రారంభించిన కమిటీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆయన మంత్రివర్గ సభ్యులతో సమావేశమైంది. జమిలి ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని పరిష్కరించే మార్గాలపై కమిటీ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఇప్పటికే పర్యటించిన కమిటీ అక్కడ రాజ్యాంగ నిపుణులు, పౌర సమాజ సంస్థలు, ఇతర భాగస్వాములతో సమావేశమైందని ఆయన తెలిపారు. కాల పరిమితి గురించి ప్రశ్నించగా కమిటీ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని అన్నారు. 2029లో జరగబోయే తదుపరి సాధారణ ఎన్నికల నాటికి ఈ సంస్కరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే అంతకంటే ముందే కొన్ని రాష్ర్టాలను దీని పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎట్టిపరిస్థితుల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని మహిళా సంఘాల కూటమి డిమాండ్ చేసింది. మోదీ ప్రభుత్వానికి 33 శాతం రిజర్వేషన్ల బిల్లు గురించి హెచ్చరిక జారీ చేసింది. నియోజకవర్గాల పునర్విభజన, జన గణనతో సంబంధం లేకుండా బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో వర్షాకాల సమావేశాలు జరిగినంత కాలం తాము నిరసనను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసింది. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు, రచయితలు సహా 1,472 మంది సంతకం చేసిన ఈ ప్రకటనను మహిళా రిజర్వేషన్ జాతీయ కూటమి విడుదల చేసింది. డీలిమిటేషన్, లోక్‌సభ స్థానాల పెంపు అనే తన రాజకీయ అజెండాతో ముందుకు వెళ్లడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం ఒక ముసుగుగా ఉపయోగిస్తున్నదని కూటమి ఆరోపించింది. తదుపరి ఎన్నికల దశ నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది.