
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు ఉన్న నిబద్ధతకు ప్రధానమంత్రి వ్యాఖ్యలే నిదర్శనం. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు దాదాపు 22 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. దేశంలోని ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ వెళ్లిన ప్రతిసారి తెలంగాణకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించి, వాటిని పరిష్కరించాలని కోరుతూనే ఉన్నారు. మంత్రి కేటీఆర్ సహా ఇతర రాష్ట్ర మంత్రులదీ అదే దారి. పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. ఆఫీసుల చుట్టూ తిరిగారు. టీఆర్ఎస్ ఎంపీలు కలవని కేంద్రమంత్రి లేడంటే అతిశయోక్తి కాదు. వీరంతా తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. కేంద్రం మాత్రం 90 శాతానికిపైగా అంశాలను పెండింగ్‌లో పెట్టింది. వందసార్లు బతిమాలితే ఒక్కసారి స్పందిస్తూ తెలంగాణ సహనాన్ని పరీక్షిస్తున్నది.
సీఎంగా బాధ్యతలు తీసుకొన్న వెంటనే..
2014లో జూన్ 2న సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండురోజులపాటు పర్యటించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆయా మంత్రిత్వ శాఖల నుంచి రాష్ర్టానికి రావాల్సిన సదుపాయాలపై చర్చించారు. విభజన చట్టం ప్రకారం గిరిజన వర్సిటీ, ఇతర విద్యాసంస్థలు, ఖమ్మంలో స్టీల్ ప్లాంట్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, విద్యుత్తు ప్లాంట్, వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిలో ఒక్కటి కూడా పూర్తిగా నెరవేరలేదు. ముఖ్యంగా స్టీల్‌ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ ఏండేండ్లుగా కలగానే మిగిలిపోయాయి. 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజన ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నది.
10-20కి తగ్గకుండా..
సీఎం కేసీఆర్ తన రెండో పర్యటనలో ప్రధాని ముందు 14 డిమాండ్లను ఉంచారు. మరుసటి పర్యటనలోనూ దాదాపు 20 అంశాలపై వినతులు ఇచ్చారు. అలా సీఎం కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రగతిని గుర్తించి అదనపు సదుపాయాలు కల్పించాలని విన్నవిస్తూనే ఉన్నారు. విద్య, వైద్యం, హోం, పర్యావరణం.. ఇలా అన్ని శాఖల కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ స్వయంగా కలిశారు. ఆయా శాఖలకు సంబంధించి రాష్ర్టానికి రావాల్సిన సదుపాయాలపై విజ్ఞప్తి చేశారు. వాటన్నింటినీ కేంద్రం బుట్టదాఖలు చేస్తూనే ఉన్నది. మరి రాష్ట్ర సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు బాధ్యత తీసుకొంటారా?
అంశాలన్నీ పెండింగ్
విభజన హామీలు, విద్యాసంస్థలే కాదు.. తెలంగాణ ప్రభుత్వం అనేక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఇందులో 90 శాతానికిపైగా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కృష్ణా నదీ పరీవాహం తెలంగాణలోనే 60% ఉన్నది. దీని దృష్ట్యా ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిలో న్యాయంగా సగం వాటా తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా కేంద్రం దగ్గర మొత్తుకుంటున్నది. కానీ ఇప్పటికీ తేల్చలేదు.
మరికొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే..
ఉడాన్ పథకం కింద జిల్లాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వసతులు కల్పించింది. ముఖ్యంగా వరంగల్‌లో నిజాం కాలంలోనే విమానాశ్రయం ఉన్నదని, దాన్ని పునరుద్ధరించాలని ముందునుంచీ కోరుతున్నది. భూ సేకరణకు సైతం సంసిద్ధత వ్యక్తం చేసింది. కేంద్ర పౌర విమానయానశాఖ నుంచి సిబ్బంది వచ్చి వెళ్తున్నారే తప్ప ఇంతవరకు ప్రయోజనం లేదు. దేశంలో రూ.4 లక్షల కోట్లతో వంద ఎయిర్‌పోర్టులు కడతామని చెప్పిన కేంద్రం.. వరంగల్‌కు మాత్రం మొండిచెయ్యి చూపించింది.
పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, వరంగల్ అర్బన్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్ 12న ఢిల్లీకి వెళ్లి అప్పటి విమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీకి విన్నవించారు. అయినా వాటికి మోక్షం కలగలేదు.
తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మధ్యాహ్నభోజనానికి ఆహ్వానించి రాష్ట్రంలో విమానాశ్రయాల గురించి వివరించారు. వరంగల్ విమానాశ్రయంలో తొందర్లోనే విమానాలు తిరుగనున్నాయని.. మరో ఆరు విమానాశ్రయాలకు సంబంధించిన సాంకేతికాంశాల క్లియరెన్స్ బాధ్యతన తనదేనని చెప్పి వెళ్లిన సింధియా ఆ తరువాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు నిధులు కేటాయించి ఆదుకోవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేకసార్లు కేంద్రాన్ని కోరారు. చూద్దాంలే అంటూ తప్పించుకు తిరుగుతున్నారే తప్ప పట్టించుకున్న పాపానపోలేదు. చేనేతను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ను ఏర్పాటు చేయాలని విన్నవించినా ఉలుకూపలుకూ లేదు. అదే.. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ పేరుతో ‘స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్’ పేరుతో కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న టెక్స్టైల్ ఎగుమతులు- ఉత్పత్తి- తయారీ యూనిట్లకు నిధులు కేటాయిస్తున్నది. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదో మాత్రం చెప్పడంలేదు.
ఆసియాలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇది దేశానికే గర్వకారణంగా మారుతుందని, నిధులు ఇచ్చి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయినా మోదీ సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తున్నది.
రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని నాలుగేండ్లుగా అడుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు.
హైదరాబాద్ నగర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు, ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కంటోన్మెంట్ భూములు ఇవ్వాలని కోరితే కొత్త మెలికలు పెడుతూ తిప్పుకొంటున్నారే తప్ప ఇవ్వడం లేదు.
లెదర్ పార్క్‌కు చేయూత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరినా ఇప్పటివరకు స్పందన లేదు.
హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కోరితే పట్టించుకోవడం లేదు. కానీ.. గుజరాత్లో గిఫ్ట్ సిటీ పేరుతో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇచ్చింది. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌కు సైతం నిధులు ఇచ్చింది.
హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు మరో విషాధ గాథ. దేశానికే ఐటీ కేంద్రంగా మారిన హైదరాబాద్‌కు ఆర్థికంగా, ఇతర వనరుల పరంగా ప్రాధాన్యం ఇచ్చి మరింత ప్రోత్సహించాల్సిందిపోయి యూపీఏ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎన్డీయే రద్దు చేసింది. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ 2014లోనే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10 సార్లు లేఖలు రాసినా కనికరించలేదు.
బతిమాలుకొంటేనే..
2014 సెప్టెంబర్‌లో ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పచ్చదనం పెంపుకోసం కంపా నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో లేఖలు రాసి, స్వ యంగా విజ్ఞప్తులు చేస్తే దాదాపు ఐదున్నరేండ్ల తర్వాత 2019 ఆగస్టులో నిధులు మంజూరు చేశారు.
తెలంగాణకు జాతీయ రహదారుల
కేటాయింపులో అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ సహా ఎంపీలు, మంత్రులు అనేకసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కనీసం అందులో సగం రోడ్లకు కూడా నిధులు విడుదల చేయలేదు.
వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున రాష్ర్టానికి ఏటా రూ.450 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉన్నది. వీటిని ఏటా ఠంచనుగా విడుదల చేయాల్సిందిపోయి ఇష్టం వచ్చినప్పుడు రెండు, మూడేండ్లకు ఒకసారి విడుదల చేస్తున్నది. ఇప్పటికీ రెండేండ్ల నిధులు రూ.900 కోట్లు రావాల్సి ఉన్నది. ఐజీఎస్టీ బకాయిలదీ అదే పరిస్థితి.
రాష్ర్టానికి ఎయిమ్స్ మంజూరు చేయాలని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి విన్నవించడంతోపాటు అనేకసార్లు లేఖలు రాశారు. ఐదేండ్ల తర్వాత 2019లో ఎయిమ్స్ తరగతులు మొదలయ్యాయి.
2018 జూలై 20 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పరిణతి ప్రదర్శిస్తున్నారు. ఆయన పూర్తిగా పాలన, రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. విభజన సమస్యల పరిష్కా రానికి నాతోపాటు కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర గవర్నర్‌ను అనేకసార్లు కలిశారు.
2016 ఆగస్టు 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ రాష్ట్రం గురించే ఆలోచిస్తుంటారు. నా దగ్గరికి ఎప్పుడొచ్చినా రాష్ట్ర అభివృద్ధి గురించి, నీటి గురించే మాట్లాడుతుంటారు.