e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News మత్తు వదలాలె

మత్తు వదలాలె

 • గంజాయి పీడ పూర్తిగా తొలగించాలి..
 • నేరగాళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
 • గంజాయి పండిస్తే రైతుబంధు, బీమా బంద్‌..
 • ఆర్వోఎఫ్‌ఆర్‌ భూముల్లో సాగు చేస్తే పట్టా రద్దు
 • డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారాలి
 • లేకుంటే మన విజయాలన్నీ నిర్వీర్యమే
 • గంజాయి నిర్మూలనకు ప్రణాళిక రచించాలి
 • ఉత్తమంగా పనిచేసే సిబ్బందికి రివార్డులు
 • డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్‌
 • ఇంటెలిజెన్స్‌ విభాగంలోనూ ప్రత్యేక విభాగం
 • పోలీస్‌, ఎక్సైజ్‌శాఖల సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యుద్ధభేరి మోగించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు దొరుకుతుండటం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. గంజాయి పండించేవారికి రైతుబంధు, రైతుబీమా బంద్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ మత్తు పదార్థాల పీడను వీలైనంత త్వరగా వదిలించకపోతే మనం సాధిస్తున్న విజయాలన్నీ నిర్వీర్యమయ్యే ప్రమాదమున్నదన్నారు. గుడుంబాపైనా ఉక్కుపాదం మోపాలని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడేలా ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలు ఉమ్మడిగా పనిచేసి గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా పనిచేయాలని ఆదేశించారు.

తెలంగాణను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలని స్పష్టంచేశారు. బుధవారం ప్రగతిభవన్‌లో పోలీస్‌, ఎక్సైజ్‌శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గంజాయి అక్రమసాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గంజాయి వినియోగం క్రమంగా పెరుగుతున్నట్టు వస్తున్న నివేదికల నేపథ్యంలో గంజాయి మీద తీవ్రస్థాయి యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. పరిస్థితి మరింత తీవ్రం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, గంజాయి ఉత్పత్తిని, రవాణాను సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

- Advertisement -

పటిష్ఠ శాంతిభద్రతలతోనే పెట్టుబడులు
‘సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణను సాధించుకొన్నాం. అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకొన్నాం. వ్యవసాయం, మిషన్‌ భగీరథ, విద్యుత్తు తదితర అనేక రంగాల్లో అపూర్వ విజయాలు సాధించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థల్లో 99% సంస్థలు మన దగ్గర భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్‌శాఖ ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యంతోనే పెట్టుబడులు మన రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్‌శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉన్నది. దీంతో రాష్ట్ర గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగింది. ఇంతగా రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయివంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరుగుతుండటం శోచనీయం’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

మత్తు పీడ తొలగించాలి
‘మత్తు పదార్థాల పీడను తొందరగా తొలిగించకపోతే.. మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో నేను ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశాను. పెడతోవ పట్టిన యువత వాట్సప్‌లో గ్రూపులుగా ఏర్పడి.. వాటిలో మెసేజ్‌లు చేసుకుంటూ గంజాయి తాగుతున్నారని నివేదికలు వస్తున్నాయంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమాయకులైన యువకులు తెలిసీ తెలియక గంజాయి ముఠాల బారిన పడుతున్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో యువత మానసికంగా దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. డీ-అడిక్షన్‌ చాలా క్లిష్టమైన, సుదీర్ఘ ప్రక్రియ. గంజాయిని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. గంజాయి మాఫియాను అణచివేయాలి, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు’ అని సీఎం కేసీఆర్‌ విస్పష్టంగా ఆదేశించారు.

నిర్లక్ష్యం చేస్తే చేయి దాటిపోతుంది
పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలు సమన్వయంతో పటిష్ఠమైన వ్యూహం రూపొందించుకొని గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గంజాయి వాడేవారిని గుర్తించి వారి ద్వారా సరఫరాదారులను పట్టుకోవాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చెక్‌పోస్టుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం గంజాయి రవాణా.. రాష్ట్రంలో నియంత్రించే స్థాయిలోనే ఉన్నదని.. అయితే, దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చేయి దాటిపోతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో గంజాయి నియంత్రణకు తీసుకొంటున్న చర్యలను పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ర్టాల నుంచే వస్తున్నదని, ఛత్తీస్‌గఢ్‌లోనూ గంజాయి సాగు ఎక్కువగా ఉన్నదని తెలిపారు. గంజాయి వినియోగిస్తున్న వారిలో వలస కూలీలు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, యువత ఎక్కువగా ఉంటున్నట్టు వారు సీఎం దృష్టికి తెచ్చారు.

ప్రధానంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) నుంచి గంజాయిని భద్రాచలం మీదుగా మన రాష్ట్రంలోకి తెస్తున్నారని వివరించారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలకు రవాణా అవుతున్నట్టు వెల్లడించారు. ఇతర రాష్ర్టాల పోలీస్‌, ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమన్వయ వ్యవస్థ ఏర్పాటుతోనే దీన్ని అడ్డుకోగలమని చెప్పారు. ఎక్సైజ్‌, పోలీస్‌శాఖలతోపాటు అటవీశాఖ చెక్‌పోస్టుల్లోనూ నిఘా పెంచాల్సి ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. తెలంగాణలో గంజాయి వ్యాపారం చేయలేం అని గంజాయి వ్యాపారులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చెక్‌పోస్టులు, నిఘా కేంద్రాలు హైవేలపైనే కాకుండా అవసరమైన అన్నిచోట్లా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు
గంజాయి నిరోధానికి డీజీ (డైరెక్టర్‌ జనరల్‌) స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను, ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను ఆదేశించారు. విద్యాసంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్ఠం చేయడంతోపాటు తగినన్ని వాహనాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ శాఖలోనూ ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని సూచించారు. గంజాయి సాగు, రవాణా, వినియోగం.. ఇలా ప్రతి దశను అరికట్టడంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ కీలకంగా పనిచేయాలని చెప్పారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేస్థాయిలో ఆధునిక సమాచార వ్యవస్థ ఉండాలని, డీజీ స్థాయిలో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

గంజాయి హైదరాబాద్‌కు రాకుండా ఆపే విధంగా పటిష్ఠ వ్యూహాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో గంజాయి సాగు ఉన్నట్లయితే ఆయా గ్రామాల సర్పంచ్‌లు సమాచారాన్ని ఎక్సైజ్‌, పోలీస్‌ అధికారులకు అందించాలని సీఎం సూచించారు. ఈ కేసులలో నేరస్థులకు త్వరితగతిన శిక్ష పడేలా, కేసులు పకడ్బందీగా నమోదు చేసేందుకు ప్రత్యేక న్యాయవాదులను నియమించుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. గంజాయి నిర్మూలనలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులకు క్యాష్‌ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు తదితర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

తెలంగాణ పోలీస్‌ బెస్ట్‌
‘తెలంగాణ పోలీస్‌కు దేశంలోనే బెస్ట్‌ పోలీస్‌ అనే పేరున్నది. దాన్ని నిలబెట్టుకోండి. దేశంలో ఏదైనా రాష్ట్రంలో సమర్థ్ధంగా గంజాయి నియంత్రణ జరిగినా.. ఆ అనుభవాలను పరిశీలించండి. రాష్ట్రంలో గుడుంబా, గ్యాంబ్లింగ్‌ తిరిగి తలెత్తుతున్నాయి. గతంలో పేకాట నిషేధం అమలైన తీరుపై రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తిరిగి ఈ రుగ్మత సమాజంలో తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోండి. పేకాట ఆగిపోవాలి. అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలో నంబర్‌వన్‌గా పేరు తెచ్చుకున్నాం. రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడేవిధంగా ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలు ఉమ్మడిగా పనిచేసి గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా పనిచేయాలి. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, హోం శాఖ సలహాదారు అనురాగ్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, సెక్రటరీ స్మితా సబర్వాల్‌, శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, అడిషనల్‌ డీజీలు, ఐజీలు ఇతర పోలీస్‌, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముమ్మరంగా ప్రచారంచేయాలి
మత్తు పదార్థాల వినియోగంతో వచ్చే అనర్థాలు యువతకు తెలిసేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గతంలో ఎయిడ్స్‌ ప్రభావాలపై ఉధృతంగా ప్రచారం చేయడంవల్లనే ప్రజల్లో భయాన్ని కలిగించగలిగామని, అదే తరహాలో మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపైనా ప్రచారం చేయాలని సూచించారు. యువకుల్లో అవగాహన, పరిణతి కల్పించేలా అద్భుతమైన రీతిలో ప్రచార కార్యక్రమాలు కొనసాగాలని చెప్పారు. ఇందుకోసం షార్ట్‌ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, సందేశాత్మక ఆడియో, వీడియో ప్రకటనలు రూపొందించే బాధ్యతను సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ అప్పగించారు. మాదకద్రవ్యాల వినియోగం ఎంత ప్రమాదకరమైందో విద్యార్థి దశ నుంచే తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించి, వాటిని సిలబస్‌లో చేర్చాలని సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. డ్రగ్స్‌ దుష్పరిణామాల గురించి తెలిసేలా ప్రతిభావంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమైన అధికారులతో మరోమారు సమావేశం నిర్వహించి పూర్తిస్థాయి వ్యూహాన్ని ఖరారుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

హాట్‌స్పాట్లను గుర్తించి చర్యలు: డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి
గంజాయి వినియోగంలో హాట్‌స్పాట్లుగా మారిన సెంటర్లను వెంటనే గుర్తించి, ఆ ప్రాంతాల్లో నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి సూచించారు. వైజాగ్‌, మలన్‌గిరి పోలీసులతో సమన్వయం చేసుకొనే దిశగా అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు. ఎక్సైజ్‌, పోలీసు శాఖల సంయుక్త సమావేశం ద్వారా గంజాయి నియంత్రణలో ముందడుగు పడినట్టయిందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

గుడుంబాపైనా ఉక్కుపాదం మోపాలి
గంజాయితోపాటు రాష్ట్రంలో గుడుంబాను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గుడుంబా నిర్మూలనను ఒక పవిత్ర కర్తవ్యంగా భావించాలని, రాజీలేని విధంగా దృఢ సంకల్పంతో అధికారులు ముందుకు సాగాలని చెప్పారు. గుడుంబా తాగి భర్తలు చనిపోవడంతో చిన్న వయస్సులోనే గిరిజన యువతులు వితంతువులుగా మారుతుండటం తన హృదయాన్ని కలచివేసిందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాష్ట్రంలో గుడుంబా నిషేధం సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, గుడుంబా తయారీదారులపై ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. గుడుంబా స్థానికంగానే తయారవుతున్నందున, దాన్ని అరికట్టడం ఎక్సైజ్‌శాఖకు సాధ్యమేనన్నారు. గుడుంబా అమ్మకంపై ఆధారపడి జీవిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించాలని, ఇందుకు అవసరమైన నిధులను కలెక్టర్లకు విడుదల చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో గుడుంబా తయారీ మళ్లీ మొదలవుతున్నట్టు సమాచారం వస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, నిషేధం అమలులో లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సీఎం కేసీఆర్‌ ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు.

గంజాయి పండిస్తే రైతుబంధు, రైతుబీమా బంద్‌
గంజాయి పండించే రైతులకు రైతుబంధు, రైతుబీమాను నిలిపివేయాలన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆర్వోఎఫ్‌ భూముల్లో గంజాయి సాగుచేస్తే ఆ పట్టాలను సైతం రద్దుచేయాలని యోచిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని అధికారులు సీఎం ఆదేశించారు.

మత్తు పదార్థాల పీడను తొందరగా తొలిగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు, వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో నేను ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశాను.
పెడతోవ పట్టిన యువత వాట్సాప్‌లో గ్రూపులుగా ఏర్పడి, వాటిలో మెసేజ్‌లు చేసుకుంటూ గంజాయి తాగుతున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గంజాయిని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధం. గంజాయి మాఫియాను అణచివేయాలి, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు.

 • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement