హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఓట్ల రూపంలో సొమ్ము చేసుకొనేలా దుర్మార్గంగా బీజేపీ వ్యవహరిస్తున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కశ్మీర్ పండితులకు బీజేపీ చేసిందేమీ లేదని.. వాళ్లకు ఎలాంటి ఉపశమనం కలిగించకపోగా రాజకీయాల కోసం వాడుకొన్నదని విమర్శించారు. కశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని తిప్పి కొట్టాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలని, అవసరమైతే వ్యతిరేక ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ సమావేశంలో తీర్మానం చేశామని వెల్లడించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అంటే.. ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకనమిక్ ఫైల్స్ ఉంటాయని.. కశ్మీర్ ఫైల్స్ ఏందం టూ నిలదీశారు. ఇది బీజేపీ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని అభివర్ణించారు. తమకు పైసా పనిచేయలేదని, రిలీఫ్ రాలేదంటూ కశ్మీర్ పండిట్లు మొత్తుకొంటున్నారని, వారికి న్యాయం చేయాల్సిందేనని డిమాం డ్ చేశారు. దేశాన్ని, ప్రజలను విభజించి, ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు సరైనవి కావని ఆక్షేపించారు. తెలంగాణ సమాజానికి ఇలాంటివి జీర్ణం కావని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు సకల జనుల సమ్మె అని పిలుపునిచ్చామే కానీ.. హిందువుల సమ్మె, సిక్కుల సమ్మె, ముస్లింల సమ్మె, క్రైస్తవుల సమ్మె అని చెప్పలేదని గుర్తుచేశారు.
దేశం ఎటుపోతున్నది?
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడటానికి ఉద్యోగులకు సెలవులు కూడా ఇస్తున్నారన్న కేసీఆర్.. దేశం ఎటు పోతున్నదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు, పుణె నుంచి రూ.5 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. విభజన రాజకీయాలు, విద్వేషాలతో మంచి వాతావరణానికి నష్టం జరిగితే ఎవరు బాధ్యులంటూ నిలదీశారు. కశ్మీర్ ఫైల్స్, పుల్వామా, గల్వాన్.. ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రతిసారీ ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతున్నదని విమర్శించారు. ప్రాజెక్టో, కరెంటో, ఉద్యోగాలో, పరిశ్రమల ప్రస్తావనే ఉండదని విమర్శించారు.
గంగలో వేల శవాలు కేంద్ర వైఫల్యానికి నిదర్శనం
కరోనా కబళించినప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. వలస కూలీలు అన్నమో రామచంద్రా అంటూ ఘోషించాల్సి వచ్చిందన్నారు. దేశం ఎదుర్కొన్న అతి పెద్ద విషాదమిదేనన్నారు. గంగానదిలో కరోనాతో చనిపోయిన వేల మంది శవాలను పారేయడాన్ని ఎవరూ దాచలేరన్నారు. బీజేపీ ప్రభుత్వం ‘పక్కా చునావీ జుమ్లా సర్కార్’ అని సీఎం ఎద్దేవా చేశారు. ‘2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కేంద్రం పరిధిలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. వాటిని భర్తీ చేయరు’ అన్నారు. ఖాళీల భర్తీపై తమ పార్టీ ధర్నాలు చేస్తుందని ప్రకటించారు.
ఉక్రెయిన్ విద్యార్థులపై ఉలుకుపలుకు లేదు
ఉక్రెయిన్‌లో మన దేశానికి చెందిన 20 వేల మంది విద్యార్థులను తీసుకొని రాలేదని, ఎంబసీని మాత్రం నెల ముందే ఖాళీ చేయించిందన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల చదువులకయ్యే మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తుందని అసెంబ్లీలో ప్రకటించామని చెప్పారు. బెంగాల్ ప్రభుత్వం కూడా ప్రకటించినా, కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదని విమర్శించారు.
అన్నింట్లో వెనుకబాటే
దేశంలో జీడీపీ పెంచుకొనేది లేదని, ఆర్థికాభివృద్ధి లేదని, అన్ని ఇండెక్స్‌లలో భయంకరంగా వెనుకబడి ఉన్నామని సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇటీవల వచ్చిన హ్యాపీనెస్ ఇండెక్స్‌లో 149 దేశాల్లో సర్వే చేస్తే భారత్‌కు 139వ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. నిరుద్యోగితలో చివరినుంచి రెండో ర్యాంకులో ఉన్నామని, సిరియా కంటే అధ్వానంగా ఉన్నామన్నారు. ప్రజాస్వామ్య విలువుల పరిస్థితిలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో కానీ, హంగర్ ఇండెక్స్‌లో కానీ దేశం వెనుకబడి ఉన్నదని చెప్పారు.
బీజేపీ పోవాల్సిందే
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచనే బీజేపీలో ఉన్నదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దిస్ గవర్నమెంట్ షుడ్ గో.. వి హావ్ టూ ప్యాకప్ దిస్ గవర్నమెంట్ బ్యాక్ టూ హోం’ అని అన్నారు. దేశంలో ప్రగతిశీల ప్రభుత్వం రావాల్సి ఉన్నదని.. ఇందుకోసం తాము పనిచేస్తున్నామన్నారు. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. అనుమతులు తీసుకోకుండా శివాజీ విగ్రహాలను పెడుతున్నారని, అడ్డుకుంటే అల్లర్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేమన్నా రౌడీయిజమా? అని మండిపడ్డారు. శివాజీని అందరూ గౌరవిస్తారని, నిబంధనలు పాటించి, అనుమతులు తీసుకొని విగ్రహాలు పెడితే ఎవరూ అడ్డుకోరని అన్నారు. ప్రముఖుల పేర్లతో రాజకీయం ఎందుకని ప్రశ్నించారు.
రిజర్వేషన్లపై స్పందనేది?
రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఉండొద్దని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ‘తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలుచేస్తారు. ఇంకో రాష్ట్రంలో ఇంకోవిధంగా అమలుచేస్తారు. తెలంగాణలో మాత్రం 50% దాటొద్దంటారు. దీనిపై ప్రధానిని కూడా అడిగాం’ అని చెప్పారు. ఏదైనా ప్రాంతంలో, రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి ఉంటే ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పులో ఉన్నదని గుర్తుచేశారు. తీర్పుపై కమిషన్ ఏర్పాటుచేసి, అధ్యయనంచేసి.. గిరిజన రిజర్వేషన్లు 10%కి పెంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానంచేసి కేంద్రానికి పంపించామని చెప్పారు. ఇప్పటికీ కేంద్రంనుంచి స్పందన లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానంచేసి పంపినా అతీగతీ లేదన్నారు. బీసీ కులగణనలో నష్టమేంటని ప్రశ్నించారు?