సిద్దిపేట, ఫిబ్రవరి 17 : సిద్దిపేట మరో మెగా క్రీడాటోర్నీకి వేదికైంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని స్థానిక ఆచార్య జయశంకర్ మినీ స్టేడియం వేదికగా క్రికెట్ కప్ గురువారం అట్టహాసంగా మొదలైంది. ఈ పోటీలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారికంగా ప్రారంభించారు. టోర్నీ ప్రారంభం సందర్భంగా స్టేడియానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు, ప్రముఖ హీరో అక్కినేని అఖిల్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పటాకుల మోత, అభిమానుల ఈలలు, చప్పట్లతో స్టేడియం మారుమోగింది. మంత్రి హరీశ్‌రావు, అఖిల్ కొద్దిసేపు సరదాగా క్రికెట్ ఆడి అలరించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కోసి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావు, టోర్నీ నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.