అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఏపీకి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆనందంగా, ఆరోగ్యాలతో ఉండాలని చంద్రబాబు ట్విటర్లో ఆకాంక్షించారు.
గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాట యోధుడు కేసీఆర్ అని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఎంతటి జఠిలమైన సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఎదురైనా తన మాటలతో, వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
రాష్ట్ర విభజన తరవాత హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితోపాటు తనకు ఆనందాన్ని కలిగించిందని ఆయన వెల్లడించారు. చిరకాలం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు