
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అంగన్వాడీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలుగా చూసుకుంటున్నారని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నల్లా భారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అంగన్వాడీ వర్కర్లకు 3 సార్లు వేతనాలు పెంచారని గుర్తు చేశారు. సంఘం అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో అంగన్వాడీలకు వేతనాలు అడిగితే గుర్రాలతో తొక్కించారని చెప్పారు. స్వరాష్ట్రం సాధించిన తరువాత సీఎం కేసీఆర్ తమను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నారని కొనియాడారు. సమావేశం చివరన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీ నిర్మల, నాగలక్ష్మి, కే ఎల్లమ్మ, అరుణ, రేణుక, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.