Srisailam | లోక కల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం కార్తీకమాసం పొడవునా నిర్వహించిన శివచతుస్సప్తాహ భజనలు సోమవారం మార్గశిర శుద్ద పాడ్యమితో ముగిశాయి. కార్తీక శుద్ద పాడ్యమి (2024 నవంబర్ రెండో తేదీ) నుంచి ప్రారంభమైన ఈ భజన కార్యక్రమం కార్తీక మాసం అంతా కూడా నిరంతరంగా రేయింబవళ్లు అఖండ శివ పంచాక్షరి నామ భజన చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.
కర్నూల్ జిల్లాకు చెందిన రెండు భజన బృందాలు, కర్ణాటకలోని నాలుగు భజన బృందాలకు ఈ భజనల్లో అవకాశాలు కల్పించినట్లు దేవస్థానం తెలిపింది. కర్నూల్ శ్రీ గురు నిమిషాంబ దేవి భజనమండలికి నవంబర్ రెండో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ, కర్నూల్ చెన్నకేశవ నాటక కళా భజన మండలికి గత నెల ఏడో తేదీ నుంచి 12 వరకూ భజనలకు అవకాశం కల్పించారు.
కర్ణాటకలోని బళ్లారి శ్రీశైల మల్లికార్జున భజన సంఘం వారు నవంబర్ 12 నుంచి 17 వరకు, రాయచూర్ జిల్లా గోపన దేవరహళ్లి శ్రీ మౌళి బసవేశ్వర భజన్ సంఘ్ వారు గత నెల 17 నుంచి 22 వరకూ, రాయచూర్ జిల్లా సుమ్కేశ్వరాహాల్ శ్రీ మల్లికార్జున భజన మండలి ఆధ్వర్యంలో గత నెల 22 నుంచి 27 వరకూ, రాయచూర్ జిల్లా గోపన దేవరహళ్లి శ్రీ ప్రభులింగ్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో గత నెల 27 నుంచి ఈ నెల రెండో తేదీ వరకూ భజనలు చేశారు. సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు.