న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud).. ప్రభుత్వ ఆస్పత్రిలో తనకు జరిగిన ఓ అనుభవాన్ని ఆయన గుర్తు చేశారు. పబ్లిక్ హాస్పిటల్లో ఉన్న ఫ్లోర్‌పై ఓసారి నిద్రపోయినట్లు ఆయన వెల్లడించారు. తమ బంధువు ఒకర్ని ఆస్పత్రిలో చేర్పించినపుడు.. ప్రభుత్వ ఆస్పత్రి నేలపై పడుకున్నట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. డాక్టర్లు 36 గంటల పాటు నిర్వరామంగా పనిచేసిన సందర్భాలను ప్రత్యక్షంగా చూసినట్లు సీజే తెలిపారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
నిరసన ప్రదర్శన చేపడుతున్న డాక్టర్లు తక్షణమే విధుల్లో చేరాలని సుప్రీం ధర్మాసనం కోరింది. విధుల్లో చేరిన డాక్టర్లకు ఉద్యోగ రక్షణ కల్పించేందుకు కోర్టు హామీ ఇస్తుందని సీజే తెలిపారు. ఒకవేళ డాక్టర్లు విధుల్లో చేరుకుంటే, అప్పుడు ఎలా ప్రజా ఆరోగ్య వ్యవస్థ పనిచేస్తుందని చంద్రచూడ్ ప్రశ్నించారు. సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది.
డీవై చంద్రచూడ్‌తో పాటు ఆ బెంచ్‌లో జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా ఉన్నారు. ట్రైనీ డాక్టర్ మృతదేహానికి ఎప్పుడు పోస్టుమార్ట్ చేశారని, కచ్చితమైన సమయం చెప్పాలని జస్టిస్ పర్దివాలా ప్రశ్నించారు.